Begin typing your search above and press return to search.

వీరసింహారెడ్డి విడుదల వేళ 200 కార్లతో మహార్యాలీ.. తెలంగాణలో?

By:  Tupaki Desk   |   12 Jan 2023 9:30 AM GMT
వీరసింహారెడ్డి విడుదల వేళ 200 కార్లతో మహార్యాలీ.. తెలంగాణలో?
X
జనాల జీవితాల్లో సినిమా భాగమే అయినా.. సినిమా చుట్టూ తమ జీవితాల్ని తిరిగేలా చేసుకోవటం తెలుగు ప్రజలకు ఎక్కువ. అవునన్నా.. కాదన్నా తెలుగు ప్రజల జీవితాల్లో సినిమా చాలా కీలకమైన భూమిక పోషిస్తుందన్న నిజాన్ని ఒప్పుకొని తీరాలి. సాధారణంగా పండుగ వేళలో ఎలాంటి ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుందో.. ఒక పెద్ద హీరో సినిమా విడుదలకు వారం ముందు నుంచి ఉత్సాహభరిత వాతావరణం ఉంటుంది. అంతదాకా ఎందుకు? సినిమా విడుదల రోజున పండుగ వాతావరణం కనిపిస్తుంది.

ఒకవేళ సినిమా కానీ హిట్.. సూపర్ హిట్ అయితే.. ఆ విజయం తమ సొంతమన్నట్లుగా సంబరపడిపోవటం.. ఫెయిల్ అయితే.. తామే ఏదో కోల్పోయినట్లుగా బాధ పడే తీరు ఉంటుంది. క్రికెట్ క్రీడలోనూ ఇలాంటి పరిస్థితి ఉన్నా.. ప్రతి మ్యాచ్ లోనూ పండుగ వాతావరణం ఉండదు. కానీ..

సినిమా కత వేరు. ఇప్పుడు నడుస్తున్నది సంక్రాంతి సీజన్. ఈ పెద్ద పండుగ వేళకు సంబంధించి ఎవరి ప్లాన్ చూసినా సరే.. ఒకట్రెండు సినిమాలు.. మరో సినిమా అంటే.. మూడు సినిమాలు కనీసం చూడాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తారు. ఇది యూత్ నుంచి పెద్ద వయస్కుల వరకు కనిపిస్తుంటుంది.

ఇక.. తమ అభిమాన హీరో సినిమా విడుదల వేళలో.. సమ్ థింగ్ డిఫరెంట్ గా సెలబ్రేట్ చేయాలన్న ధోరణి కూడా కనిపిస్తూ ఉంటుంది. అందుకోసం వారు పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. ఇలాంటి ధోరణి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందునా కోస్తా.. గోదావరి జిల్లాల్లో మరికాస్త ఎక్కువగా ఉంటుంది. అలాంటిది తాజాగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న సందడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బాలయ్య నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి విడుదలై.. థియేటర్లు కళకళలాడుతున్న వేళ.. ఆయన అభిమానులు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం నుంచి 200 కార్లు.. ట్రాక్టర్లు వేసుకొని థియేటర్ కు తరలివెళ్లటం ఆసక్తికరంగా మారింది. బాలయ్య మీద తమకున్న అభిమానంతో ఇలా చేస్తున్నట్లుగా వారు చెబుతున్నారు. కార్ల ముందు బాలయ్య జెండాల్ని కట్టుకొని.. మహా ర్యాలీగా సినిమా థియేటర్ కు వెళ్లిన వైనం చూస్తే.. కోస్తాలో కనిపించే సీన్ తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో కనిపించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పకతప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.