Begin typing your search above and press return to search.

ఫ్యాన్ పై చరణ్‌ ప్రేమ అద్భుతహా

By:  Tupaki Desk   |   19 Aug 2017 5:20 AM GMT
ఫ్యాన్ పై చరణ్‌ ప్రేమ అద్భుతహా
X
మెగా స్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ తర్వాత మెగా పవర్ స్టార్ గా ఎదిగిన హీరో రామ్ చరణ్. సినిమాల్లోకి వచ్చిన అతి కొద్దీ రోజులకే టాలీవుడ్ లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తన ప్రవర్తనతో అభిమానులకు కూడా చాలా దగ్గరయ్యాడు. షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా.. తనను కలవడానికి వచ్చిన అభిమానులను నిరాశపరచకుండా కలుస్తున్నాడు చరణ్.

రీసెంట్ గా ఓ అంగవైకల్యం కలిగిన యువతి తన అభిమాన హీరో అయిన చరణ్ ని కలవడానికి షూటింగ్ స్పాట్ కి వచ్చింది. అప్పుడు చరణ్ హైదరాబాద్ కు దూరంగా ఉన్న ఓ ప్రాంతంలో చేస్తున్న రంగస్థలం 1985 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీంతో ఎంతో కష్టపడి అక్కడకు వెళ్లిన దీపికను చరణ్ కలిశాడు. షూటింగ్ లో బిజీగా ఉన్నాసరే ఆ అమ్మాయితో ఫోటో దిగి కొంత సేపు మాట్లాడాడు. ఇక ఆ తర్వాత తన అనుచరులకు చెప్పి ఆ యువతిని హైదరాబాద్ వరకు జాగ్రత్తగా తీసుకెళ్లమని చెప్పాడట. దీంతో ఆ యువతీ తన అభిమాన హీరో ఆప్యాయతకు ఆనందపడిపోయింది.

చరణ్ కు ఇలా వ్యవహరించడం కొత్తేమి కాదు. చాలాసార్లు ఫ్యాన్స్ ను కలవడమే కాకుండా బాధలో ఉన్నవారికి తనవంతు సహాయాన్ని అందించాడు. గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్స్ లో బిజీగా ఉన్నప్పుడు చరణ్ ఓ బాలుడు గుండెజబ్బుతో బాధపడుతున్నాడని తెలుసుకొని అతనికి వైద్యాన్నీ చేయించి ఆదుకున్నాడు. చరణ్ సినిమాలతోనే కాకుండా తన మంచితనంతో కూడా అభిమానులకు మరింత దగ్గరవుతూ అద్భుతహా అనిపించుకుంటున్నాడు.