Begin typing your search above and press return to search.

అసలైన వారసత్వానికి చరణ్ బెస్ట్ ఎగ్జామ్ పుల్!

By:  Tupaki Desk   |   24 April 2022 8:30 AM GMT
అసలైన వారసత్వానికి చరణ్ బెస్ట్ ఎగ్జామ్ పుల్!
X
కొరటాల శివ ఏ కథను ఎంచుకున్నా ఆ కథ ఏదో ఒక సందేశాన్ని అందించకుండా వెళ్లదు. ఆయన ఏ సినిమాను తెరకెక్కించినా అందులో వినోదం పాళ్లు ఎంతమాత్రం తగ్గవు. ఆ వినోదంతో పాటు సమాజానికి అవసరమైన సందేశాన్ని సున్నితంగా అందించడం కొరటాల శివ ప్రత్యేకత. ఆయన నుంచి ఇంతవరకూ వచ్చినా ఏ సినిమా ఫ్లాప్ కాలేదు .. ఏ సినిమాలోను సందేశం లేకుండా లేదు. అలాంటి ఆయన నుంచి ఈ నెల 29వ తేదీన 'ఆచార్య' వస్తోంది. ఈ నేపథ్యంలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

'గాడ్ ఫాదర్' సినిమాను డైరెక్ట్ చేసిన మోహన్ రాజా .. 'భోళా శంకర్'కి దర్శకత్వం వహిస్తున్న మెహర్ రమేశ్ .. 'వాల్తేరు వీర్రాజు' సినిమాను డైరెక్ట్ చేస్తున్న బాబీ .. 'ఆర్ ఆర్ ఆర్'తో చరణ్ కి హిట్ ఇచ్చిన రాజమౌళి ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ వేదికపై మోహన్ రాజా మాట్లాడుతూ .. "హనుమాన్ జంక్షన్' తరువాత మళ్లీ 20 ఏళ్లకి 'గాడ్ ఫాదర్' వంటి ఒక తెలుగు సినిమా డైరెక్టర్ గా ఈ స్టేజ్ మీదికి రావడం జరిగింది. ఈ సినిమాకి నన్ను ఒక దర్శకుడిగా చిరంజీవిగారు ఎంపిక చేయడాన్ని బ్లెస్సింగ్స్ గా భావిస్తున్నాను. అందుకు ఆయనకి ఎంతగా థ్యాంక్స్ చెప్పినప్పటికీ చాలదు.

మా నాన్న ఎడిటర్ మోహన్ గారు 'హిట్లర్' సినిమాను నిర్మించారు. ఒక నిర్మాత కొడుకుగా .. చిరంజీవిగారి అభిమానిగా నేను చిరంజీవి గారి షూటింగును చాలా దగ్గరగా చూసేవాడిని. ఆయనపై గల అభిమానం ఇప్పటికీ ఇంచు కూడా తగ్గలేదు .. ఇంకా పెరిగిందనే చెప్పాలి.

ఆయనతో ఇంకా ఇంకా పనిచేయాలని ఉంది. చరణ్ గారు తమిళంలో నా సినిమా 'తనీ ఒరువన్'కి తెలుగులో 'ధ్రువ' రూపం ఇచ్చారు. అప్పుడు నేను నిజంగా చాలా గర్వంగా ఫీలయ్యాను. నా కథలో చరణ్ ను అలా చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది.

'గాడ్ ఫాదర్'లో ఒక డైలాగ్ ఉంది .. 'వారసత్వం అంటే పదవి కాదు .. బాధ్యత' అని. అందుకు మంచి ఉదాహరణ రామ్ చరణ్. ఆ బాధ్యతను ఆయన ఎలా మోస్తూ వస్తున్నారనేది చూస్తూనే ఉన్నాము. అందుకు చరణ్ గారికి హ్యాట్సాఫ్ చెబుతున్నాను.

మా ఫాదర్ నిర్మించిన' మనసిచ్చి చూడు' సినిమాకి మణిశర్మగారు పనిచేశారు. అప్పుడు నాన్నగారే ఆయనకి 'మెలోడీ బ్రహ్మ' అనే టైటిల్ ఇచ్చారు. అలాంటి ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక కొరటాల శివగారి విషయానికి వస్తే, నేను ఆయనకి అభిమానిని. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.