Begin typing your search above and press return to search.

'సైరా' చేయమంటే సురేందర్ నాన్చాడట

By:  Tupaki Desk   |   22 Aug 2018 1:30 AM GMT
సైరా చేయమంటే సురేందర్ నాన్చాడట
X
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం వస్తే ఎవరైనా వద్దంటారా? ఆగి ఆలోచిస్తారా? కానీ దర్శకుడు సురేందర్ రెడ్డి ఆగాడట. ఆలోచించాడట. కొన్ని రోజుల తర్వాత కానీ ఓకే చెప్పలేదట. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విషయంలో ఇది జరిగిందట. ఈ విషయాన్ని ఈ చిత్ర టీజర్ లాంచ్ సందర్భంగా స్వయంగా నిర్మాత రామ్ చరణే వెల్లడించాడు. ఇంకా ‘సైరా’ పట్టాలెక్కడానికి ముందు ఏం జరిగింది.. దీని బడ్జెట్ ఎంత.. విడుదల ఎప్పుడు.. ఇతర విశేషాలపై చరణ్ మీడియాతో మాట్లాడాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..

”సూరి గారితో ధ్రువ నుంచి ట్రావెల్‌ అవుతున్నాను.ఆ సినిమా తర్వాత సూరి గారి కూడా వేరే వేరే కథలు వెతుకుతూ ఉన్నప్పుడు నేను పరుచూరి సోదరులను ఒకసారి కలవండి అన్నాను. కథ విన్నారు. నాన్నగారితో చేస్తే బావుంటుందనగానే మామూలుగా ఏ డైరక్టర్‌ అయినా వెంటనే గెంతేసేవారు.

అమెరికాలో ఉన్నపుడు చెబితే.. తర్వాత ఇండియాకు వచ్చి.. టైమ్‌ తీసుకుని.. నాన్నగారితో సినిమా అంటే ఎంత బాధ్యత ఉంటుందో ఊహించుకుని ఈ సినిమాకు అంగీకారం తెలిపారు. కథ విని.. ఆయన శైలికి అర్థం చేసుకుని నాన్నగారిని కలిశారు. 12 ఏళ్లుగా ఈ సినిమా నానుతూ ఉంది. కానీ సురేందర్ రెడ్డి స్క్రిప్టు చెప్పాక నాన్న ఒక్క సిట్టింగ్‌ తో ఓకే చేసేశారు. పరుచూరి సోదరులు ఈ పన్నెండేళ్లలో మాతో చాలా సినిమాలు చేశారు. ఐతే ఉయ్యాలవాడ కథ మాత్రం ఓకే కాలేదు. ఇంటికి వచ్చినపుడల్లా ఉయ్యాలవాడ కథ గురించి ప్రస్తావించి.. నాన్నకు ఈ సినిమా గురించి చెప్పమనేవారు. నేను చెప్పడమేంటండీ అని అనేవాడిని. ఈ కథ పక్కాగా తయారు కాకపోవడం వల్లో.. లేక ఈ కథకు తగ్గ దర్శకుడు, టెక్నికల్ టీం దొరక్కపోవడం వల్లో.. దీనికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు అందుబాటులో లేకో.. ఇంకేవైనా కారణాల వల్లో తెలియదు కానీ.. నాన్న ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదు. అయినప్పటికీ పరుచూరి సోదరులు మాత్రం ఆశలు వదులుకోలేదు.

ఐతే ఇప్పటికైనా ఈ సినిమా పట్టాలెక్కిందంటే అది పరుచూరి సోదరుల పట్టుదల వల్లే. సైరాని వచ్చే ఏడాది సమ్మర్‌ లో విడుదల చేయాలనుకుంటున్నాం. అయితే అందరిలో సైరాలో ఏముంది? అసలు నరసింహారెడ్డి ఎవరు? అనే విషయాలు తెలుసుకోవడానికి ఎగ్జయిటింగ్‌ గా ఉన్నారు. ఈ సినిమాను దక్షిణాది భాషలన్నింటిలోనూ విడుదల చేస్తున్నాం. బడ్జెట్‌ గురించి ఆలోచించడం లేదు. డాడీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కాబట్టి వెనకా ముందూ చూడకుండా.. దేనికీ వెనకాడకుండా తీస్తున్నాం. ఎక్కువగానే పెట్టి చేస్తున్నాం. నాకైతే ప్రాఫిట్స్‌ వస్తే బోనస్‌. రాకపోయినా ఆనందమే. ఖర్చును.. మరోదాన్ని ద ష్టిలో పెట్టుకోకుండా చేస్తున్నాం. ఇలాంటి సినిమా చేస్తున్నందుకు గర్విస్తున్నా’’ అని చరణ్ అన్నాడు.