Begin typing your search above and press return to search.

రంగస్థలంతో చిరుకు లింక్

By:  Tupaki Desk   |   27 Jan 2018 4:18 AM GMT
రంగస్థలంతో చిరుకు లింక్
X
రామ్ చరణ్ రంగస్థలం టీజర్ రిలీజ్ అయ్యాక దాని మీద రకరకాల అంచనాలు మొదలయ్యాయి. పాత్ర స్వభావం ఏంటో చెప్పేయటంతో ఇక మిగిలిన పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి అప్పుడే ఆసక్తి మొదలైంది. సహజంగా చరణ్ ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు చిరంజీవి గతంలో చేసిన వాటితో పోలిక పెద్దగా వచ్చేది కాదు. కారణం చెర్రి చేస్తున్న కథలు దాదాపు రెగ్యులర్ కమర్షియల్ కాన్సెప్ట్ ఉన్నవే కావడంతో అదేమంత హై లైట్ అయ్యేది కాదు. కాని మొదటిసారి పల్లెటూరి బైతుగా నటిస్తున్న చరణ్ తో గతంలో చిరంజీవి ఇలాంటి పాత్రలు చేయడాన్ని గుర్తు చేసుకుంటే ఒక కొత్త తరహా విశ్లేషణ కనిపిస్తుంది. పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చిరు తన కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలే చేసారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఆపద్భాందవుడు. కల్లాకపటం ఎరుగని అమాయకుడిగా - పాలు అమ్ముకుంటూ నాటకాలు వేసే మాధవుడిగా చిరు నటన ఇప్పటికీ ఎంచదగినదే. ఆర్థికంగా సినిమా విజయం సాధించలేదు కాని ఆర్టిస్ట్ గా మాత్రం గొప్ప పేరు తెచ్చింది.

కెరీర్ మొదట్లో చిరంజీవి చేసిన పల్లెటూరి మొనగాడు - ఊరికిచ్చిన మాట రెండూ కూడా పూర్తి పల్లె వాతావరణంలో చేసిన సినిమాలు. హిట్స్ కూడా అనిపించుకున్నాయి. పున్నమి నాగులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయగా ఆరాధనలో కరుడు గట్టిన రౌడీగా ఊర మాస్ అవతారంలో కనిపించారు. ఇక రుద్రవీణలో అభ్యుదయ భావాలు కలిగిన సూర్యంగా తన గ్రామం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధ పడే పాత్రలో చిరు నటనకు ప్రశంశలతో పాటు అవార్డులు కూడా దక్కాయి. స్నేహం కోసం నేపధ్యం కూడా మొత్తం పల్లెటూరిలోనే ఉంటుంది. ఇంకా చాలానే ఉన్నాయి కాని ముఖ్యమైన వాటినే ఇక్కడ పరిగణించడం జరిగింది. ఇవన్ని సెల్ ఫోన్ - టెక్నాలజీ ప్రాభవం లేకుండా కథను రాసుకుని తీసిన సినిమాలు.

ఇప్పుడు రంగస్థలంతో చరణ్ చేస్తున్న ఈ మూవీ వాటిని మించే విధంగా ఉండాలి అనేది మెగా ఫాన్స్ అంచనా. లోతుగా ఆలోచిస్తే తప్ప అర్థం కాని తరహాలో సినిమాలు తీస్తాడు అని పేరున్న సుకుమార్ ఇలాంటి కథను ఎంచుకోవడం పట్ల మొదట్లో ఆశ్చర్యం వ్యక్తమైనా ఇప్పుడు టీజర్ చూసాక అన్ని మటుమాయం అయిపోయాయి. చరణ్ చిట్టిబాబు పాత్రలో పూర్తిగా ఒదిగినట్టు అనిపించడంతో పాటు 1985 కాలం నాటి కథ కాబట్టి చిరు రోజులను గుర్తుకు తెచ్చేలా ఉన్నాడు అనే చర్చ అప్పుడే మొదలైంది.