Begin typing your search above and press return to search.

మన హీరోలు మారారబ్బా..

By:  Tupaki Desk   |   25 Jan 2018 11:30 PM GMT
మన హీరోలు మారారబ్బా..
X
తెలుగు సినిమా హీరో అంటే సర్వ శక్తిమంతుడు. సకల గుణవంతుడు. మన హీరోలకు ఏ చిన్న లోపం పెట్టడానికి కూడా ఇష్టపడేవాళ్లు కాదు రచయితలు.. దర్శకులు. దీని వల్ల పాత్రల్లో వైవిధ్యం లేకుండా పోయింది. ఐతే పొరుగున ఉన్న తమిళంలో.. మలయాళంలో అలా కాదు. హీరోలకు రకరకాల లోపాలుంటాయి. అందుల్లో ఆ కథల్లో వైవిధ్యం కనిపించేది. ఐతే గత కొన్నేళ్లేలో మనదగ్గరా పరిస్థితి మారింది. కథలు.. పాత్రల్లో మార్పు వచ్చింది. మన హీరోల పాత్రలు కొత్తదనం సంతరించుకుంటున్నాయి. మన కథానాయకుల్లోనూ ‘లోపాలు’ కనిపిస్తున్నాయి. గత ఏడాది ఇద్దరు స్టార్ హీరోలు ఇలాంటి లోపాలున్న క్యారెక్టర్లు చేశారు.

అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్ గురించే. ‘జై లవకుశ’లో జై పాత్రకు నత్తి లోపం ఉంటుంది. ఆ లోపమే ఆ పాత్రకు ప్రత్యేకత తెచ్చిపెట్టింది. ఆ పాత్ర సినిమాకే హైలైట్ అయింది. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత మాస్ రాజా రవితేజ ‘రాజా ది గ్రేట్’లో అంధుడిగా కనిపించి ఆశ్చర్యపరిచాడు. హీరో అంధుడనగానే కథ అదోలా సాగుతుందనే సందేహాలకు తెరదించుతూ.. ఈ చిత్రాన్ని ఎంటర్టైనింగ్ గా నడిపించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ సినిమా కూడా బాగానే ఆడింది. ఇప్పుడిక సుకుమార్ ‘రంగస్థలం’లో తన హీరో రామ్ చరణ్ ను చెవిటివాడిగా చూపిస్తున్నాడు. పైన చెప్పుకున్న సినిమాలతో పోలిస్తే ఇది భిన్నం. పై రెండు సినిమాల్లో మాదిరి ఏదో హీరోకు లోపం ఉందంటే ఉంది అన్నట్లుగా సుకుమార్ చూపిస్తాడని అనుకోలేం. ఆ పాత్ర ద్వారా సినిమాకు ఒక కొత్తదనం తీసుకొస్తాడనడంలో సందేహం లేదు. టీజర్ అంతా ఈ లోపం చుట్టూనే తిరిగింది. మరి సినిమాలో దీన్ని ఎలా వాడుకుంటాడు.. హీరోను ఎలా చూపిస్తాడు అన్న ఆసక్తి జనాల్లో ఉంది. ఆ సంగతలా వదిలేస్తే.. మన తెలుగు హీరోలు ఇలా వరుసగా నత్తి.. అంధత్వం.. చెవుడు లాంటి లోపాలున్న పాత్రల్లో కనిపించడం మాత్రం గొప్ప మార్పు.