Begin typing your search above and press return to search.

చరణ్ ను టెన్షన్ పెడుతున్న ఎన్టీఆర్

By:  Tupaki Desk   |   2 Jan 2016 11:01 AM GMT
చరణ్ ను టెన్షన్ పెడుతున్న ఎన్టీఆర్
X
కొత్త ఏడాదిలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ‘నాన్నకు ప్రేమతో’ ఒకటి. సంక్రాంతి బరిలో ఉన్న మిగతా సినిమాల గురించి జనాలకు ఓ ఐడియా ఉంది కానీ.. ‘నాన్నకు ప్రేమతో’ మాత్రం అంచనాలకు అందేలా లేదు. సుకుమార్ మామూలుగానే విభిన్నమైన కథాకథనాలతో సర్ ప్రైజ్ చేస్తుంటాడు. ‘నాన్నకు ప్రేమతో’ కూడా ఆ కోవలోనే వైవిధ్యంగా ఉండబోతోందని ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. ట్రైలర్ని బట్టి జనాలకు అర్థమైంది ఏంటంటే.. మామూలు మాస్ సినిమాల తరహాలో ఇందులో భీభత్సమైన ఫైట్లు - రక్తపాతాలు ఏమీ ఉండవు. ప్రధానంగా మైండ్ గేమ్ మీద సినిమా నడిచేలా కనిపిస్తోంది.

ఎన్టీఆర్-జగపతి మధ్య సాగే మైండ్ గేమ్, ఎత్తులు పైఎత్తులే సినిమాకు హైలైట్ కాబోతున్నాయని తెలుస్తోంది. జగపతి పాత్ర జనాల్ని బాగా ఆకర్షిస్తోంది. ఆసక్తి రేపుతోంది. హీరో-విలన్ మధ్య వార్ ఎలా ఉంటుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నవాళ్లలో రామ్ చరణ్ కూడా ఉన్నాడంటున్నారు ఇండస్ట్రీ జనాలు. దీనికి కారణం లేకపోలేదు.

చరణ్ ‘తనీ ఒరువన్’ అనే తమిళ సినిమా రీమేక్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇది కూడా హీరో-విలన్ మైండ్ గేమ్ మీద నడిచే సినిమానే. పెద్దగా రక్తపాతాలేమీ ఉండవు. ఎత్తులు పై ఎత్తులతో ఉత్కంఠగా సాగుతుంది. విలన్ పాత్ర స్మార్ట్ గా కనిపిస్తూ చాలా కన్నింగ్ గా ప్రవర్తిస్తుంది. ఆ క్యారెక్టర్ సినిమాకు హైలైట్ అయింది. ఈ నేపథ్యంలో ‘నాన్నకు ప్రేమతో’ కూడా ఆ తరహాలోనే ఉంటే.. తాను చేయబోయే సినిమాకు ఇబ్బందవుతుందేమో అని చరణ్ కొంచెం టెన్షన్ పడుతున్నట్లు చెబుతున్నారు. అందకే ‘నాన్నకు ప్రేమతో’ చూశాక స్క్రిప్టులో ఏమైనా మార్పులు చేయాలా అని వెయిట్ చేస్తున్నాడట.