Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వానికి సత్తా ఉంటే సినిమా తీసి పేదలకు ఫ్రీగా చూపించాలి..!

By:  Tupaki Desk   |   4 Jan 2022 5:48 AM GMT
ఏపీ ప్రభుత్వానికి సత్తా ఉంటే సినిమా తీసి పేదలకు ఫ్రీగా చూపించాలి..!
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్ల వ్యవహారం మీద ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు టికెట్ ధరల నియంత్రణ విషయంలో ప్రభుత్వం మొండిపట్టు పడుతుంటే.. మరోవైపు ఆ రేట్లతో నష్టాలు తప్పవని, దీనిపై పునరాలోచించుకోవాలని సినీ పెద్దలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం గతేడాది ఏప్రిల్‌ లో టికెట్‌ ధరలపై జారీ చేసిన జీవో నెంబర్‌ 35 పై గత కొన్ని రోజులుగా సినీ ప్రముఖులు - నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.

ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న ఆర్జీవీ.. సినిమా టికెట్ల ధరల అంశంపై మాట్లాడారు. ఏపీ ప్రభుత్వాన్ని కరోనా వైరస్ తో పోల్చడమే కాకండా.. ఓ ఇద్దరి హీరోల కోసం సినీ పరిశ్రమలోని చిన్న హీరోలను ఇబ్బంది పెడుతున్నారేమో తనకు తెలియదంటూ సర్కారు తీరును ఎండగట్టే ప్రయత్నం చేసారు వర్మ. అంతేకాదు రేకుల షెడ్డు థియేటర్ - మల్టీఫ్లెక్స్ లలో సినిమా టికెట్స్ ఒకేలా ఉండాలనే నిర్ణయాన్ని కాకా హోటల్ - ఫైవ్ స్టార్ హోటల్ ధరలతో పోలుస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇందులో భాగంగా ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని - వర్మ మధ్య ఆసక్తికరమైన డిబేట్ జరిగింది.

ఇదే క్రమంలో సోమవారం రాత్రి వోడ్కా తాగుతూ ఓ వీడియో పోస్ట్ చేసిన ఆర్జీవీ.. వైయస్సార్సీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో పలు ప్రశ్నలు సంధించారు. సీఎం జగన్ - సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్నినాని - అనిల్ కుమార్ యాదవ్ - కొడాలి నాని కలిసి రాజమౌళి కంటే గొప్ప సినిమా తీయాలని.. దాన్ని పేద ప్రజలకు ఫ్రీగా చూపించాలని ప్రభుత్వం మీద సెటైర్స్ వేశారు వర్మ. మీకు అలాంటి కెపాసిటీ లేనప్పుడు.. మీకున్న పవర్ ని ఉపయోగించుకొని కెపాసిటీ ఉన్నవాళ్ళ ప్రతిభను తగ్గించడం రెడిక్యులస్ అని అన్నారు.

అలానే 'సినిమా నచ్చకపోతే ప్రేక్షకులకు డబ్బులు వెనక్కి ఇస్తారా?' అని మంత్రి నాని ప్రశ్నకు రామ్ గోపాల్ వర్మ సమాధానం ఇచ్చారు. టమోటో నచ్చలేదని వెనక్కి ఇవ్వడానికి.. టమోటోని కొరికి రుచి చూసిన తర్వాత టేస్ట్ బాగాలేదని చెప్పడానికి చాలా తేడా ఉందని అన్నారు. ఒకవేళ మీరు చెప్పేదే కరెక్ట్ అనుకుంటే 'నాకు వైసీపీ పరిపాలన నచ్చలేదని ఓటేసిన వాడు అంటే వెంటనే మీరు దిగిపోతారా?' అని వర్మ కౌంటర్ వేసాడు. వోడ్కా బాటిల్ తో ఆర్జీవీ మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఎప్పుడూ ఏపీ ప్రభుత్వానికి సపోర్ట్ గా మాట్లాడే ఆర్జీవీ.. సినిమా టికెట్ రేట్ల వ్యవహారంలో వైసీపీని గట్టిగా తగులుకున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.