Begin typing your search above and press return to search.

#KRKR: చంద్ర‌బాబును ప‌ట్టాడండోయ్!

By:  Tupaki Desk   |   6 Sep 2019 10:42 AM GMT
#KRKR: చంద్ర‌బాబును ప‌ట్టాడండోయ్!
X
`ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` త‌ర్వాత `క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు` అంటూ మ‌రో సినిమాని ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ‌ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఆయ‌న‌ మార్క్ ప్ర‌చారార్భాటంతో టైటిల్ జ‌నాల్లోకి దూసుకెళ్లింది. త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ల‌క‌ ముందే మ‌రోసారి త‌న‌దైన మార్క్ హంగామా ప్రారంభించిన ఆర్జీవీ.. ఇప్ప‌టికే టైటిల్ పై లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. టైటిల్ కి త‌గ్గ‌ట్టే ఈ సినిమాలో వ‌ర్త‌మాన‌ రాజ‌కీయ నాయ‌కుల్ని ఏ కోణంలో చూపించ‌బోతున్నాడో ఇప్ప‌టికే చెప్పేశాడు. ముఖ్యంగా ఏపీ రాజ‌కీయాల్ని ఆర్జీవీ హైలైట్ చేస్తున్నారు. కుల రాజ‌కీయాల్ని ఎత్తి చూపే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. మాజీ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు- ప్ర‌స్తుత ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇరువురి వైరం నేప‌థ్యంలో సినిమా తీస్తున్నాడ‌ని అంతా అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం రాజ‌కీయ నాయ‌కుల పాత్ర‌ధారుల్ని ఎంపిక చేస్తూ వేడెక్కిస్తున్నాడు.

చంద్ర‌బాబు- వైయ‌స్ జ‌గ‌న్- వైకాపా మ‌హిళా నాయ‌కురాలు రోజా- లోకేష్ నాయుడు- నారా బ్రాహ్మ‌ణి- నారా దేవాన్ష్‌- దేవినేని ఉమ‌- కేసినేని నాని-కోడెల శివ ప్ర‌సాద్- గంటా శ్రీ‌నివాస‌రావు-సుజ‌నా చౌద‌రి- అచ్చ‌య్య నాయుడు- స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం- స్పీక‌ర్ బుచ్చ‌య్య చౌద‌రి- ఎస్పీ గౌత‌మ్ .. త‌దిత‌ర పాత్ర‌ధారుల్ని.. అలాగే జాతీయ స్థాయి నాయ‌కుల్లో భార‌త దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ- అమిత్ షా త‌దిత‌ర పాత్ర‌ల‌కు డూప్ ల‌ను వెతుకుతున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇందులో తొలిగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పాత్ర‌ధారిని ఎంపిక చేసి అత‌డిపై ఫోటోషూట్ ని చేశారు. జ‌న‌సేన‌ పార్టీని పెట్టి తెల్ల కుర్తాలోకి మారిన ప‌వ‌న్ గెట‌ప్ ని రివీల్ చేయ‌డంతో దానిపై మెగా ఫ్యాన్స్ మండి ప‌డ్డారు. త‌మ ఫేవ‌రెట్ ని ఇలా చూపిస్తావా? అంటూ సీరియ‌స్ అయ్యారు.

తాజాగా మ‌రో కీల‌క పాత్రధారి అయిన చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో న‌టిస్తున్న డూప్ ఫోటోని ఆర్జీవీ సామాజిక మాధ్య‌మాల్లో రివీల్ చేశారు. ఖ‌ద్ద‌రు చొక్కా.. ప‌క్క పాపిడి.. తీక్ష‌ణ‌మైన చూపులు.. అచ్చం చంద్ర‌బాబులానే క‌నిపిస్తున్నాడు ఈ డూప్. ఒక చేత్తో వైట్ పేప‌ర్.. ఇంకో చేత్తో క‌ళ్ల‌ద్దాలు ప‌ట్టుకుని కాస్తంత సీరియస్ గా ఆ ఫోజు అద‌ర‌హో అనే చెప్పాలి. ఆర్జీవీ మార్క్ ఫోటో షూట్ ఇది. సెల‌క్ష‌న్ భేషుగ్గానే ఉంద‌ని అర్థ‌మవుతోంది. ``గెస్ చేయండి.. ఈ కొత్త న‌టుడు ఎవ‌రు? ఎవ‌రి రియ‌ల్ లైఫ్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు?`` అంటూ ఆర్జీవీ ఫ్యాన్స్ కి ఫ‌జిల్ వేశారు. దానికి స‌మాధానంగా ``ఇప్ప‌ట్లో చంద్ర‌బాబును వ‌దిలేట్టు లేవుగా ఆర్జీవీ!`` అంటూ ఓ నెటిజ‌న్ స్పందించాడు. ఎలా దొరుకుతారు సామీ నీకు వీళ్లు? అంటూ వేరొక నెటిజ‌న్ రిప్ల‌య్ ఇచ్చారు. బావుంద‌య్యో ఆర్జీవీ... నీ సెల‌క్ష‌న్ పాడు గానూ!