Begin typing your search above and press return to search.

ఆనాడు సింహగర్జన.. నేడు లక్ష్మీస్ ఎన్టీఆర్..

By:  Tupaki Desk   |   29 March 2019 7:25 AM GMT
ఆనాడు సింహగర్జన.. నేడు లక్ష్మీస్ ఎన్టీఆర్..
X
ఆంధ్రప్రదేశ్ లో తను తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ విడుదల కాకుండా హైకోర్టుకు వెళ్లి అడ్డుకోవడంపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ నిప్పులు చెరిగారు. లక్ష్మీ స్ ఎన్టీఆర్ విడుదలను ఏపీ ప్రభుత్వం ఆపడం.. ఎన్టీఆర్ కు తిరిగి మరొక్కసారి వెన్నుపోటు పొడవడమేనని వర్మ మండిపడ్డారు. చంద్రబాబు ఆరోజు టీడీపీని హైజాక్ చేసినప్పుడు ఆంధ్రాలో సింహగర్జన సభను పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదని..దాంతో సీనియర్ ఎన్టీఆర్ మానసిక క్షోభకు గురిచేసి ఆయనను చంపేశారని వర్మ చెప్పుకొచ్చారు. ఇవ్వాళా ఆయన మీద తీసిన సినిమా ఏపీలో రిలీజ్ అవ్వకుండా మళ్లీ వెన్నుపోటు పొడిచారని వర్మ ధ్వజమెత్తారు..

నాడు ఎన్టీఆర్ కు సాయం చేయడానికి ఆయన పార్టీ లేదని.. నాయకులు లేరని.. ఆయన కుటుంబసభ్యులు అంతా కలిసి వెన్నుపోటు పొడిచారని వర్మ మండిపడ్డారు. ఇవ్వాళ మేము రాజ్యాంగ హక్కును తీసుకొని వాటి బలంతో సినిమా తీసి పోరాడడానికి ప్రయత్నిస్తున్నామని.. 100శాతం తమకు ఇందులో విజయం దక్కుతుందని ఎన్టీఆర్ సాక్షిగా తాను ప్రమాణం చేస్తున్నానని వర్మ అన్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో కోర్టులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయని.. ఈ విషయంలో సుప్రీం కోర్టులో కూడా తేల్చుకుంటామని వర్మ ప్రకటించారు. సినిమా విడుదల కాకముందే ఆపడం చట్టరీత్యం సమ్మతం కాదని.. విడుదలయ్యాక ఏదైనా వివాదం ఉంటే ఆపవచ్చని తెలంగాణ హైకోర్టు ఇచ్చిందని.. కానీ ఆంధ్రాలో కోర్టులను మేనేజ్ చేసి తమ సినిమాను ఆపేశారని వర్మ మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో రిలీజ్ చేస్తామని వర్మ స్పష్టం చేశారు.