Begin typing your search above and press return to search.

ప‌డ‌క‌గ‌దిని ప‌ట్టించుకోను!-ఆర్జీవీ

By:  Tupaki Desk   |   1 April 2019 4:27 AM GMT
ప‌డ‌క‌గ‌దిని ప‌ట్టించుకోను!-ఆర్జీవీ
X
``నా దృష్టిలో పడక గది సంబంధాలకు అంత‌గా విలువ ఇవ్వను. వాటికి పెద్దగా ప్రాధాన్యం ఉండదని అనుకొంటాను. కానీ మనుషులతో బంధాలకు ప్రాధాన్యం ఇస్తాను. ఓ వ్యక్తి నాకు ఎలాంటి సంతోషం కలిగిస్తాడు అన్న‌దానిని బట్టి రిలేషన్స్ ని డీల్ చేస్తాను`` అని అన్నారు ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఈ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` ఇటీవ‌లే రిలీజై మిశ్ర‌మ స్పంద‌న‌లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. తాజా మీడియా స‌మావేశంలో ఆర్జీవీ త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల్ని - వృత్తిగ‌త సంగ‌తుల్ని ముచ్చ‌టిస్తూ పైవిధంగా స్పందించారు.

ఆర్జీవీ మాట్లాడుతూ-``వర్మకు పిచ్చి.. మెంటల్.. పర్వర్టెడ్ అని ఓ వర్గం అనుకొంటారు. ఆర్జీవి ఇంటెలిజెంట్.. జీనియస్.. ఇంటెలెక్చువల్ అని మరో వర్గం అనుకొంటారు. కానీ ఎవ్వరికీ నేనంటే ఏమిటో తెలియదు. నేను అదో టైపు అంతే. అదేంటో నాక్కూడా తెలీదు. ఇంటిలిజెంట్ - మెంటల్ అనే విషయాలు మధ్య చాలా తేడా ఉంది. పచ్చ కామెర్ల వ్యాధి ఉన్న వాళ్లకు లోకమంత పచ్చగానే ఉంటుంది అంటారు. ఎవరూ ఏ కోణంలో చూస్తే వారికి నేను అలా కనిపిస్తాను`` అని అన్నారు.

ప‌డ‌క గ‌ది గురించి ఆర్జీవీ చేసిన ఓ వ్యాఖ్య ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ``పడక గది సంబంధాలను నేను అస్స‌లు పట్టించుకోను. ఎందుకంటే బంధాలు.. అనుబంధాలకు నేను బ‌హు దూరం. అలా అని రిలేషన్స్‌ ను నేను పట్టించుకోనని అనుకోవద్దు`` అంటూ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ గురించి వ్యాఖ్యానిస్తూ-``ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం. నటుడిగా బాగా ఇష్టపడుతాను. ఆయ‌న రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నేను పెద్దగా పట్టించుకోలేదు. అందుకే హత్తుకునే విధంగా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తీశాననిపిస్తుంది. ఆయన జీవితాంతం మహారాజులా.. చక్రవర్తిలా బతికారు. కానీ జీవితపు చరమాంకంలో చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. మానసిక క్షోభను అనుభవించారు. అదే విషయాన్ని సినిమాలో చూపించాను`` అని వెల్ల‌డించారు. అభ్యంతరాలు ఉండ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో పాత్రల పేర్లను మార్చాల్సి వచ్చింద‌ని తెలిపారు.