Begin typing your search above and press return to search.

వర్మ తెలివిగానే ప్లాన్ చేశాడు

By:  Tupaki Desk   |   2 Oct 2015 7:30 AM GMT
వర్మ తెలివిగానే ప్లాన్ చేశాడు
X
తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడంలో, విడుదలకు ముందు హైప్ తీసుకురావడంలో రామ్ గోపాల్ వర్మ రూటే వేరు. ఎన్ని ఫ్లాపులు తీసినా కూడా.. ఆయన కొత్త సినిమాకు ఆటోమేటిగ్గా హైప్ వచ్చేస్తుంది. ఆయన ఎంచుకునే కాంబినేషన్లు.. తనదైన శైలి ప్రమోషన్.. సినిమాకు క్రేజ్ తీసుకొచ్చేస్తాయి. ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమా విషయంలో ఇప్పటికే రావాల్సిన హైప్ వచ్చేసింది.

వీరప్పన్ ఒకప్పుడు కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేసి వంద రోజులకు పైగా తన చెరలో ఉంచుకున్న సంగతి తెలిసిందే. ఆ రాజ్ కుమార్ కొడుకు శివరాజ్ కుమార్ నే ‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాలో ముఖ్య పాత్రకు తీసుకోవడం వర్మ వేసిన తెలివైన ఎత్తుగడ. వీరప్పన్ ను చంపిన అధికారి పాత్రనే శివరాజ్ చేస్తున్నాడు. అంటే తండ్రిని కిడ్నాప్ చేసినందుకు తెరమీద ప్రతీకారం తీర్చుకోబోతున్నాడన్నమాట శివరాజ్. దీనికి మించి ఆసక్తికరమైన ఫ్యాక్టర్ ఏముందిక.

కన్నడలో ఇప్పటికే సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడిపోయాయి. దీనికి తోడు వర్మ ప్రకటించిన విడుదల తేదీలోనూ ఓ విశేషముంది. నవంబరు 13న ‘కిల్లింగ్ వీరప్పన్’ విడుదల కాబోతుండగా.. రెండు రోజుల తర్వాతి తేదీకి ఓ పెద్ద విశేషం ఉంది. 2000వ సంవత్సరంలో నవంబరు 15న వీరప్పన్.. రాజ్ కుమార్ ను తన చెర నుంచి విడుదల చేశాడు. ఈ తేదీని కన్నడిగులు అంత సులభంగా మరిచిపోలేరు. దాన్ని ఓ పండుగ రోజులా భావిస్తారు. దీన్ని రాజ్ కుమార్ కు పునర్జన్మ లభించిన రోజుగా చెప్పుకుంటారు. అందుకే ఆ తేదీకి రెండు రోజుల ముందు సినిమాను రిలీజ్ చేయడం ద్వారా జనాల్లో ఎమోషన్ తేబోతున్నాడు వర్మ. ఎంతైనా వర్మ ప్లానింగే ప్లానింగ్ మరి.