Begin typing your search above and press return to search.

వర్మ రచ్చ చేయటం ఖాయం!

By:  Tupaki Desk   |   21 Oct 2018 6:09 AM GMT
వర్మ రచ్చ చేయటం ఖాయం!
X
ఇక రాదు చల్లబడిపోయింది అనుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ను అనూహ్యంగా మళ్ళి తెరపైకి తీసుకొచ్చి సంచలనానికి తెరలేపిన రామ్ గోపాల్ వర్మ రానున్న మూడు నాలుగు నెలల్లో పెద్ద రచ్చకే ప్లాన్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో వంగవీటి తీసినప్పుడు అవసరానికి మించిన పబ్లిసిటీ కేవలం వివాదాల ద్వారానే తెచ్చుకున్న వర్మ ఇప్పుడీ మూవీకి అంతకు ఓ వంద రెట్లు హడావిడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కారణం లేకపోలేదు. వంగవీటి సినిమా విషయంలో మద్దతు కానీ అభ్యంతరాలు కానీ కేవలం బెజవాడ గుంటూరు తదితర ప్రాంతాల ప్రజలు ఆయా రాజకీయ నాయకుల అభిమానుల నుంచి మాత్రమే వచ్చాయి.

కానీ ఎన్టీఆర్ కేసు వేరు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తెలుగు నేల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ ఇప్పుడు అధికారంలో ఉన్నది టిడిపినే. కాబట్టి నిరసన ఆనండి వ్యతిరేకత అనండి ఊహకు అందని స్థాయిలో వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే తనకు బెదిరింపులు మొదలయ్యాయని వర్మ కొందరు అభిమానుల పేర్లను కూడా ప్రెస్ మీట్ లో ప్రస్తావించాడు. పదే పదే నిజాలే చూపిస్తాను అంటున్న వర్మ స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలో బాధాతప్త ఘట్టంగా చెప్పుకునే వెన్నుపోటు ఘట్టం ఉంటుందనే హామీ పూర్తిగా ఇస్తున్నాడు. ఈ రోజు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ స్పష్టం చేసాడు. అంటే వైస్రాయ్ హోటల్ లో జరిగిన పరిణామాలు మొదలుకుని ఆయన చివరి శ్వాస దాకా అంతా ఉంటుందన్న మాట.

ఇదే విడుదల సమయంలో వివాదంగా మారే అవకాశం ఉంది. పైగా మహానాయకుడు విడుదల అవుతున్న 24నే లక్ష్మీస్ ఎన్టీఆర్ డేట్ ఫిక్స్ చేయడం దానికి కీరవాణి సంగీతం అందిస్తుంటే దీనికి ఆయన తమ్ముడు కళ్యాణి మాలిక్ ను సెట్ చేసుకోవడం ఏదీ యాదృచ్చికంగా కనిపించడం లేదు వర్మ చాలా ప్లానింగ్ తోనే ఉన్నాడు. ఒకేరోజు ఎన్టీఆర్ రెండు కథలు తెరమీద చూడాల్సి రావడం అందులో భిన్నమైన కోణాల్లో దేనికవే విడిగా రూపొందటం ప్రేక్షకులకు సైతం విచిత్రమైన అనుభూతినిచ్చేలా ఉన్నాయి.

మరి వర్మ ఇంకా చెప్పాల్సింది చాలా ఉంటుంది అంటున్నాడు. రానున్న మూడు నెలల్లో ఎలాంటి పబ్లిసిటీతో జనాల దృష్టిని ఆకర్శించబోతున్నాడో లక్ష్మిస్ ఎన్టీఆర్ పబ్లిసిటీలో తెలిసిపోతుంది. ఆఫీసర్ గాయాలు పూర్తిగా మర్చిపోయేలా వర్మ వేసిన స్ట్రాటజీ చూసి విశ్లేషకులు వర్మ ఘటికుడే అంటున్నారు