Begin typing your search above and press return to search.

‘డ్రగ్స్’ మీద వర్మ భలే అడిగాడులే...

By:  Tupaki Desk   |   27 July 2017 5:59 PM IST
‘డ్రగ్స్’ మీద వర్మ భలే అడిగాడులే...
X
రామ్ గోపాల్ వర్మ కొన్నిసార్లు విడ్డూరపు వాదనలు చేసినా.. కొన్నిసార్లు కొందరిని అదే పనిగా కావాలనే కెలికినా.. కొన్నిసార్లు మాత్రం ఆయన వాదనల్లో తర్కం ఉంటుంది? చాలామంది బయటికి మాట్లాడని.. ప్రశ్నించని అంశాలపై గళం విప్పుతుంటాడు వర్మ. తాజాగా ఆయన డ్రగ్స్ విషయంలోనూ ఓ బలమైన వాదనతో వచ్చాడు. డ్రగ్స్ కు చట్టబద్దత కల్పించి.. వాటిని జన జీవనంలోకి ఎందుకు తేకూడదు అని ప్రశ్నించాడు వర్మ. డ్రగ్స్ కు చట్టబద్ధత కల్పించడమేంటి అన్యాయం కాకపోతే అని వర్మను తిట్టకండి. ఇక్కడ ఆయన పూర్తి వాదనేంటో చూడాలి ముందు.

సిగరెట్.. మద్యం కూడా ఆరోగ్యానికి హానికరమే. వాటి వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయి. కుటుంబాలపై దారుణమైన ప్రభావం పడుతోంది. మరి వాటిని మాత్రం ప్రభుత్వం ఎందుకు సమాజంలోకి అనుమతిస్తోందని ప్రశ్నించాడు వర్మ. అవి ప్రజారోగ్యానికి చేటు అని తెలిసి కూడా అనుమతిస్తున్నపుడు.. మాదకద్రవ్యాలకు కూడా చట్టబద్ధత కల్పించి మార్కెట్లోకి తీసుకొచ్చేయొచ్చు కదా అని వాదించాడు వర్మ. ఒక రకంగా చూస్తే ఆయన వాదన కరెక్టే. సిగరెట్.. మద్యం హానికరమని తెలిసినా కూడా వాటి మీద వచ్చే వేల.. లక్షల కోట్ల ఆదాయం కోసం ప్రభుత్వాలు వాటిని అనుమతిస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. మాదక ద్రవ్యాలతో పోలిస్తే అవి కొంచెం తక్కువ ప్రమాదకరం కాబట్టి.. కొంచెం మెల్లగా మనిషిని బానిసను చేసి వాళ్ల ఆరోగ్యాల్ని దెబ్బ తీస్తాయి కాబట్టి.. వాటిని మార్కెట్లోకి అనుమతిస్తాయి. ఎప్పటికప్పుడు భారీగా పన్నులేసి సొమ్ము చేసుకుంటాయి. ప్రజారోగ్యం గురించి పట్టింపు లేకుండా ఆదాయమే ముఖ్యమైనపుడు.. డ్రగ్స్ ను కూడా మార్కెట్లోకి అనుమతించేస్తే పోలా అని వర్మ వాదిస్తున్నాడు.