Begin typing your search above and press return to search.

రామ్ గోపాల్ వర్మ.. కృష్ణవంశీని తీసిపారేసి..

By:  Tupaki Desk   |   19 Nov 2016 7:18 AM GMT
రామ్ గోపాల్ వర్మ.. కృష్ణవంశీని తీసిపారేసి..
X
రామ్ గోపాల్ వర్మ శిష్యులు ఎంతమందో లెక్కల్లో చెప్పడం కష్టం. ఇటు తెలుగులో.. అటు హిందీలో కలిపితే పదుల సంఖ్యలో ఆయన శిష్యులున్నారు. వాళ్లలో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన వాళ్లలో కృష్ణవంశీ ఒకడు. అతడిని దర్శకుడిని చేసింది రామ్ గోపాల్ వర్మే. ఆ సినిమానే.. గులాబీ. ఐతే దీని కంటే ముందు కృష్ణవంశీ ‘అనగనగా ఒక రోజు’ సినిమాతో దర్శకుడు కావాల్సింది. ముందు ఆ చిత్రానికి అతనే డైరెక్టర్. కానీ వర్మ.. అతణ్ని తీసేసి తనే డైరెక్ట్ చేశాడు అన్న సంగతి చాలామందికి తెలియదు. ఇంతకీ అప్పుడు ఏ పరిస్థితుల్లో తనను వర్మ తప్పించిందీ.. ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు కృష్ణవంశీ.

‘‘అనుకోకుండా ఒక రోజు సినిమా విషయంలో నాకు.. వర్మ గారికి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. నేనొకటంటే ఆయనొకటి అనేవాడు. అదలా ఉంచితే.. నేను బడ్జెట్ విషయంలో హద్దులు దాటేశాను. కొన్ని సన్నివేశాలకు ఎక్కువ ఖర్చు పెట్టించేశాను. ఆయన నన్ను రెండు మూడుసార్లు హెచ్చరించారు. అయినా నేను మారలేదు. అది నా తప్పే. ఒక రోజు వచ్చి ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర లెక్కలు తెప్పించుకుని చూశారు. ఇలా అయితే కష్టం అనుకుని.. నన్ను పిలిచి ఈ సినిమా నువ్విక చెయ్యొద్దు అని చెప్పేశారు. నేను సరే అన్నాను. ఇక నువ్వు ఇక్కడికి రావద్దు అన్నారు. అలా కుదరదని నేను ఇక్కడే ఉంటానని అన్నాను. ఏం చేస్తావ్ అంటే.. అసిస్టెంట్ డైరెక్టర్‌ గానే చేస్తా అన్నాను. పర్వాలేదా అన్నారు. ఓకే అన్నాను. వర్మ దగ్గర పని చేసేటపుడు దర్శకుడు.. సహాయ దర్శకుడు అన్న తేడాలుండవు. అప్పుడప్పుడూ ఆయనకేదైనా ఇబ్బందుంటే మమ్మల్ని సీన్స్ తీయమని చెప్పేసి వెళ్లేవాళ్లు. అలా అంతకుముందే కొన్నిసార్లు డైరెక్ట్ చేశా. అప్పుడు నేను డైరెక్టర్ అని ఫీలవలేదు. ఇప్పుడు సహాయ దర్శకుడిని అని బాధపడనూ లేదు. కాకపోతే మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నానే అన్న గిల్ట్ ఉండేది. వర్మ గారే నన్ను తీసేస్తే.. బయటి వాళ్లు నన్ను ఎలా నమ్ముతారు అన్న ఫీలింగ్ ఉండేది. ఆ కసిలోంచే ‘గులాబి’ పుట్టింది. ఐతే ఈ సినిమా బయటి వాళ్లతో చేద్దామనుకున్నా. కానీ వర్మ గారు తన ప్రొడక్షన్లోనే చేయాలని.. తనే నన్ను ఇంట్రడ్యూస్ చేయాలని పట్టుబట్టారు. ఆ సినిమాను ఆయనే నిర్మించారు’’ అని వర్మ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/