Begin typing your search above and press return to search.
ట్విట్టర్ రీ ఎంట్రీ పై వర్మ క్లారిటీ!
By: Tupaki Desk | 5 Jan 2018 1:55 PM GMTతన సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో తన వివాదాస్పద పోస్టులతో నిత్యం వార్తల్లో నిలికే విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది మేలో ట్విట్టర్ కు టాటా చెప్పేస్తున్నట్లు ప్రకటించిన వర్మ కొంతకాలంగా తన ఫేస్ బుక్ పేజీలో యాక్టివ్ గా ఉంటూ కాంట్రవర్షియల్ పోస్టులతో నెటిజన్లను తెగ ఎంటర్ టైన్ చేస్తున్నాడు. `అజ్ఞాతవాసి` స్ఫూర్తి పొంది మళ్లీ ట్వీటడానికి వచ్చానంటూ జనవరి 2న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మీడియా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ట్విట్టర్ రీ ఎంట్రీతో పాటు అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ట్విటర్ పై బోర్ కొట్టి ట్వీట్స్ చేయడం ఆపేశానని, అయితే ట్వీట్స్ చేయకపోతే బోర్ కొట్టడంతో మళ్లీ ట్విటర్ లోకి వచ్చానని తనదైన శైలిలో బదులిచ్చాడు వర్మ.
తనను ఏకంగా పులి - పాములతో పోల్చేసుకున్నాడు వర్మా. పులి తన చారలను....పాము తన కోరలను మార్చుకోదని, తనది సెల్ఫ్ బ్రాండింగ్ కావచ్చని.... కాకపోనూ వచ్చని వర్మా తనదైన శైలిలో ఓ ప్రశ్నకు బదులిచ్చాడు. అందరి దృష్టిని ఆకర్షించాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుందని....మీడియా - రాజకీయ - సినీ రంగాల్లో ఉండేవారికి అది కొంత ఎక్కువగా ఉంటుందని వర్మ చెప్పాడు. తాను కూడా అందరినీ ఆకట్టుకోవడానికే ఇవన్నీ చేస్తానని, తాను చేసేదానికీ - రాసేదానికి మీడియా హైప్ క్రియేట్ చేస్తోందని అన్నాడు. తన కోసం ఇది రాయండి..ఇది చేయండి అని మీడియాను అడగలేదు కదా అంటూ కౌంటర్ ఇచ్చాడు వర్మ. తాను పవన్ రాజకీయ జీవితానికి సవాల్ విసిరేలా ట్వీట్ చేయడం లేదని, కేవలం సూచనలు - సలహాలు మాత్రమే ఇస్తున్నానని చెప్పాడు.
తలైవా రాజకీయ అరంగేట్రంపై కూడా వర్మ తనదైన శైలిలో స్పందించాడు. రజనీకాంత్ అన్ని స్థానాల్లోనూ తప్పక గెలుస్తారని - మిగిలిన అభ్యర్థులకు ఒక్క సీటు కూడా రాదని బల్లగుద్ది మరీ చెప్పాడు. రజనీ లాగే పవన్ కూ దమ్ము - ధైర్యం - నమ్మకం ఉన్నాయని తన అభిమాన హీరోకు కితాబిచ్చాడు. రజనీ - కమల్ లను పోల్చడం కష్టమని - వారిద్దరూ వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారని వర్మ అభిప్రాయపడ్డాడు. వచ్చే ఎన్నికల కన్నా ముందే ఎన్టీఆర్ బయోపిక్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను విడుదల చేస్తామని వర్మా క్లారిటీ ఇచ్చాశాడు. ప్రస్తుతం నాగ్ హీరోగా నటిస్తోన్న చిత్రంపై ఫోకస్ పెట్టానని వర్మ చెప్పాడు.