Begin typing your search above and press return to search.

పీకే ఫ్యాన్స్ పై వర్మ షాకింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   7 Oct 2015 3:57 AM GMT
పీకే ఫ్యాన్స్ పై వర్మ షాకింగ్ కామెంట్స్
X
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు.. రాంగోపాల్ వర్మకు మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ట్వీట్లతో ఎవరినో ఒకరిని కెలికే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఆ మధ్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు.. మహేశ్ బాబు.. సమంతల ట్విట్టర్ అకౌంట్లో ఫాలోయర్స్ మధ్యనున్న తేడా చూపిస్తూ చేసిన వ్యాఖ్యలు పీకే ఫ్యాన్స్ కు చిరాకు పుట్టించాయి.

మహేశ్.. సమంతాల ట్విట్టర్ అకౌంట్లో ఫాలోయర్స్ తో పోలిస్తే పవన్ కల్యాణ్ ఫాలోయర్స్ తక్కువగా ఉన్నారని.. పీకే ఫ్యాన్స్ కి ఇంగ్తిషు రాకపోవటమే కారణమా అంటూ వర్మ చేసిన ట్వీట్లు మంట పుట్టించటంతో పాటు.. పవన్ ఫ్యాన్స్ కు విపరీతమైన ఆగ్రహాన్ని కలిగించాయి. తమలపాకుతో నువ్విట్లంటే.. పోక చెక్కతో మేం అంటాం అన్న చందంగా.. వర్మ చేసిన ట్వీట్ కు.. మండిపోయిన పవన్ ఫ్యాన్ ఒకరు.. హటాత్తుగా రాంగోపాల్ వర్మ మరణించాడని.. దీంతో సినీ పరిశ్రమకు పట్టిన పీడ తొలిగిపోయిందంటూ ఒక ఇమేజ్ తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు. అందులో ప్రతి ఒక్క పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్.. ‘‘రిప్’’ తో పాటు.. సదరు ఇమేజ్ ను షేర్ చేయాలంటూ కోరారు. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టటం.. దీన్ని చూసిన రాంగోపాల్ వర్మకు మరెక్కడో కాలిపోయింది.

తన ట్వీట్లతో చిరాకు పుట్టించటం.. మంట పుట్టించటం మాత్రమే తెలిసిన వర్మకు.. తనకే మంట పుట్టించిన పీకే ఫ్యాన్స్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేస్తూ.. ట్విట్టర్ లో మరో మాటల యుద్ధానికి తెర తీశారు. తాను మరణించినట్లుగా ఇమేజ్ తయారు చేయటమే కాకుండా.. తన మరణానికి సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తుందంటూ పోస్ట్ ఇమేజ్ ను తిరిగి పోస్ట్ చేస్తూ.. పవన్ ఫ్యాన్ పై శివాలెత్తాడు.

పవన్ ఫ్యాన్ పై వర్మ ట్విట్టర్ ట్వీట్స్ చూస్తే.. పీకే ఫ్యాన్స్ నిజ రూపం ఇదేనంటూ తాను మరణించినట్లుగా రూపొందించిన ఇమేజ్ ను ప్రస్తావిస్తూ.. ట్విట్టర్ ఫాలోయర్స్ సంఖ్య పెరగాలని తాను ఆశిస్తున్నట్లు.. అందులో అనాగరికుల సంఖ్య తక్కువగా ఉంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లిషుపై అవగాహన పెంచేందుకు పవన్ కల్యాన్ స్కూళ్లు స్టార్ట్ చేయాలని.. వారిలో ఇంగ్లిషు అవగాహనను పెంచాలని కోరారు.

పీకేకు మెగా ఫ్యాన్ అయిన తన సూచన ఏమిటంటే.. పీకే ఫ్యాన్స్ అక్షరాస్యులుగా మారాలని.. తన సొంత ఫ్యాన్స్ ను చూసుకొని పవన్ కల్యాణ్ ఇబ్బంది పడేలా చేయొద్దన్నాడు. ఆలోచనల్లో తనను చంపొచ్చు కానీ.. తన ఆలోచనల్ని చంపలేరన్న వర్మ.. సాంకేతికంగా వికలాంగులు (అక్షరం ముక్క రాని వారు లాంటిదే) తనను అర్థం చేసుకోలేరని వ్యాఖ్యానించాడు. పీకేకు మెగా పవర్ ఫ్యాన్ అయిన తన కోరిక ఏమిటంటే.. పీకే ఫ్యాన్స్ లోని నిరక్షరాస్యులు కనీసం మహేష్ ఫ్యాన్స్ నుంచైనా పాఠాలు నేర్చుకోవాని కోరాడు. తాను పోస్ట్ చేసే ఇంగ్లిషు ట్వీట్లను తెలుగులోకి తర్జుమా చేయాలంటూ మహేశ్ ఫ్యాన్ ని కోరారు.

ఇంగ్లిషు రాని పవన్ కల్యాణ్ ప్యాన్స్ కోసం మహేశ్ ఫ్యాన్స్ ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చేపట్టాలని కోరాడు. చివరగా.. పవన్ కల్యాణ్ కు పంచ్ తప్పలేదు. రైతుల అభివృద్ధి కోసం పని చేస్తున్న పవన్ కల్యాణ్.. తన ఫ్యాన్స్ అభివృద్ధి కోసం పవన్ కల్యాణ్ కృషి చేయాలని కోరాడు. ఎందుకంటే.. రైతులు అతని సినిమా టిక్కెట్లు కొనరంటూ ఆఖరి పంచ్ వేసేసి కాస్త రెస్ట్ తీసుకున్నాడు. ఈ ఘాటైన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మరెంత చెలరేగిపోతారో..?