Begin typing your search above and press return to search.

వర్మ మాటలు నమ్మొచ్చా?

By:  Tupaki Desk   |   29 May 2018 7:45 AM GMT
వర్మ మాటలు నమ్మొచ్చా?
X
ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ చాలా తక్కువగా మాట్లాడేవాడు. గొప్ప పనితనం చూపించేవాడు. ఆయన సినిమాలో చాలా మాట్లాడేవి. కానీ తర్వాత తర్వాత వర్మ మాట్లాడటం ఎక్కువైంది. సినిమాల్లో విషయం తగ్గిపోతూ వచ్చింది. గత కొన్నేళ్లలో అయితే వర్మ చాలా చాలా మాట్లాడేశాడు. ఇక సినిమాల సంగతేంటో చెప్పాల్సిన పని లేదు. రాను రానూ వర్మ మీద అభిమానులకు పూర్తిగా నమ్మకం పోయింది. ఆయన మంచి సినిమా తీస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి నెలకొంది. వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆఫీసర్’ మీద కూడా పెద్దగా అంచనాలేమీ లేవు. ఈ చిత్ర ప్రోమోలు అంతంతమాత్రంగానే కనిపించాయి. ఐతే ‘ఆఫీసర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో వర్మ చెప్పిన మాటలు మాత్రం భలే ఆసక్తి రేకెత్తించాయి. సినిమా మీద ఆశలు పెట్టుకోవచ్చన్న భావన కలిగించాయి.

‘శివ’ తర్వాత తాను పదివేల దారుల్లో పయనించానని.. అడవి గుర్రంలా అటు ఇటు పరుగులు పెట్టానని.. అలాంటి వాడిని పట్టుకుని నాగార్జున ఆపాడని వర్మ అన్నాడు. తన స్టీరింగ్ ను నాగ్ తన చేతుల్లోకి తీసుకున్నట్లు కూడా వర్మ చెప్పాడు. నాగార్జున నుంచి చూడాలనుకునే శక్తివంతమైన హీరోయిజాన్ని ‘ఆఫీసర్’లో చూడొచ్చని.. ఈ సినిమా మొదలుపెట్టేటపుడు నాగార్జునకు ఏం మాట ఇచ్చానో దాన్ని నిలబెట్టుకున్నానని.. ఈ సినిమా ద్వారా తనను తాను రీఇన్వెంట్ చేసుకున్నానని.. అందుకు కారణం నాగార్జునే అని అన్నాడు వర్మ. తనకు తెలిసిన క్రిమినల్స్ అందరినీ సినిమాల్లో చూపించేశానని.. చివరికి ఆఫీసర్లను క్రిమినల్స్ గా చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతోనే ‘ఆఫీసర్’ తీశానని వర్మ చెప్పాడు. మొత్తంగా నిన్నటి వేడుకలో వర్మ చెప్పిన ముచ్చట్లన్నీ ‘ఆఫీసర్’లో ఏదో ప్రత్యేకత ఉందన్న ఫీలింగే కలిగించాయి. మరి వర్మ నిజంగా ‘ఆఫీసర్’ సినిమాతో తనను తాను రీఇన్వెంట్ చేసుకున్నాడా.. నాగార్జున నమ్మకాన్ని నిలబెట్టే సినిమా తీశాడా.. చూద్దాం ఈ శుక్రవారం.