Begin typing your search above and press return to search.

వైశ్రాయ్ ఘటనపై వర్మ మార్కు సమాధానం!

By:  Tupaki Desk   |   22 Oct 2018 8:05 AM GMT
వైశ్రాయ్ ఘటనపై వర్మ మార్కు సమాధానం!
X
తన గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా కొత్త సినిమాకు హైప్ ఎలా తీసుకురావాలో రామ్ గోపాల్ వర్మకు బాగా తెలుసు. ‘ఆఫీసర్’ లాంటి ఆల్ టైం డిజాస్టర్ తర్వాత వర్మ తీసే సినిమాను ఎవరు పట్టించుకుంటారునే అనుకున్నారు చాలామంది. కానీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించి దీనికి క్రేజ్ తీసుకురాగలిగాడు వర్మ. రెండు వారాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. తిరుపతిలో ఈ సినిమా ప్రారంభమైన సందర్భంగా వర్మ పెట్టిన ప్రెస్ మీట్ సంచలనం రేపింది. ఆ తర్వాత ఒక టీవీ ఛానెల్ ప్రత్యేక ఇంటర్వ్యూను వర్మ రక్తి కట్టించాడు. ఈ సినిమాకు సంబంధించి అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.

బాలయ్య చేస్తున్న ‘యన్.టి.ఆర్’ సినిమాకు వెంకయ్య నాయుడు క్లాప్ ఇచ్చారు.. మీరు తీస్తున్న చిత్రానికి వైఎస్ జగన్ క్లాప్ ఇస్తారట కదా అని అడిగితే.. ఇంకా క్లాప్ ఏంటి.. సినిమా ఆల్రెడీ మొదలైపోతే అని బదులిచ్చాడు వర్మ. ఇక ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచి వైశ్రాయ్ హోటల్లో రాజకీయం నడపడం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్న ఘటనను ప్రస్తావిస్తూ.. మీరు ఈ ఉదంతాన్ని ఏ కోణంలో చూపిస్తారు అని అడిగితే.. తాను ఏదో ఒక వైపు నిలవబోనని వర్మ స్పష్టం చేశాడు. ఆ రోజు ఏం జరిగిందో నిజాలు మాత్రం చూపిస్తానని.. ఈ విషయంలో ప్రెస్ నోట్‌ లోనే తాను స్పష్టంగా పేర్కొన్నానని.. నిరూపించగలిగే నిజాలతోనే ఈ సినిమా ఉంటుందనే మాటకు కట్టుబడతానని వర్మ స్పష్టం చేశాడు. ఇక్కడ ఊహాగానాలు.. కుట్ర లాంటి పదాలకు చోటు లేదన్నాడు.

ఎన్టీఆర్ చనిపోయిన రోజు కోట్ల రూపాయల డబ్బు ఇంటి నుంచి తరలి వెళ్లిందన్న ప్రచారం గురించి ప్రస్తావిస్తే.. నరేంద్ర మోడీ గుజరాత్ అల్లర్ల సందర్భంగా స్వయంగా వేలమందిని చంపాడు అన్న ప్రచారం ఉందని.. దాన్ని నమ్ముతారా అని వర్మ ప్రశ్నించాడు. ప్రతి విషయం గురించి జనాలు రకరకాలుగా అనుకుంటారని.. ఎవరి అభిప్రాయం వారిదని.. తాను అయితే సినిమాలో ఊహాగానాలు కాకుండా నిరూపించడానికి వీలున్న నిజాల్నే చూపిస్తానని స్పష్టం చేశాడు. ఎన్టీఆర్ చనిపోయే సమయానికి ఆయనకు సరైన రాజకీయ వారసుడు చంద్రబాబా.. లక్ష్మీపార్వతా.. లేక బాలకృష్ణా లేక హరికృష్ణా అని అడిగితే.. తాను అసలు వారసత్వ రాజకీయాల్ని నమ్మనని.. తనకు నచ్చిన ఏకైక రాజకీయ నాయకుడు ఎన్టీఆర్ అని.. ఆయన పర్సనల్ కరిష్మాను ఇష్టపడ్డానని.. తర్వాత దేశంలో తనకు మరే రాజకీయ నాయకుడూ నచ్చలేదని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని వర్మ అన్నాడు.