Begin typing your search above and press return to search.

మిడతల దండు ట్వీట్స్.. వర్మకు మరో సినిమా దొరికినట్టేనా?

By:  Tupaki Desk   |   30 May 2020 7:50 AM GMT
మిడతల దండు ట్వీట్స్.. వర్మకు మరో సినిమా దొరికినట్టేనా?
X
కాదేది రాంగోపాల్ వర్మ సినిమాలకు అనర్హం అన్నట్టుంది పరిస్థితి. ఏది ట్రెండింగ్ లో ఉంటే దానిపై సినిమాలు తీయడం మన వివాదాస్పద దర్శకుడు వర్మకు అలవాటు. అప్పట్లో రెండు రాష్ట్రాలను కుదిపేసిన ఎర్రచందనం స్మగ్లర్ ‘వీరప్పన్’ మీద సినిమా తీశాడు. అనంతరం రాయలసీమ ‘రక్తచరిత్ర’ను చూపించాడు. బెజవాడ రౌడీల ‘వంగవీటి’ని తీర్చిదిద్దాడు. ముంబైలో తాజ్ హోటల్ పై ఉగ్రవాదుల దాడిని తీశాడు.

ఇలా ట్రెండింగ్ సబ్జెక్ట్ ను కథగా మలచడంలో వర్మది అందెవేసిన చేయి. ప్రస్తుతం మహమ్మారి సోకి రెండు నెలలుగా జనాలు నిర్బంధంలో ఉంటే ఆ మహమ్మారి మీదనే సినిమా తీసి తాజాగా ‘ట్రైలర్’ను కూడా వర్మ విడుదల చేశాడు. ఇప్పటికే కరోనావైరస్ పై కవితలు, పాటలు రాసిన వర్మ ఏకంగా ఓ రెండు పాటలు కూడా పాడి విడుదల చేసి అభిమానులను తన కర్ణకఠోర గొంతుతో భయపెట్టాడు. ఇలా వర్మకు సబ్జెక్ట్ దొరికితే చాలు అలా నెలలో సినిమాలు తీసి రిలీజ్ చేస్తుంటాడు.

ప్రస్తుతం వర్మకు మరో సినిమా సబ్జెక్ట్ దొరికినట్టే కనిపిస్తోంది. తాజాగా ఆయన పొద్దున్నుంచి వరుసబెట్టి ట్వీట్లు చూస్తుంటే నిజమేనని అనిపిస్తోంది. మహమ్మారితో సతమతమవుతున్న ప్రభుత్వాలకు ఇప్పుడు మిడతల దండు దాడులు బెంబేలెత్తిస్తున్నాయి. పంటపొలాలపై పెద్ద ఎత్తున తరలివచ్చి దాడులు చేస్తూ తింటూ భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి.

దీంతో వర్మ ప్రస్తుతం ‘మిడతల దండు’పై పడ్డారు. వైరస్ లు ప్రపంచంపై దాడిచేసిన అనంతరం మిడతలు అటాక్ చేస్తున్నాయని.. తదుపరి ఏలియన్స్ దాడులు చేస్తాయా? అని వర్మ ట్వీట్ చేస్తూ ‘మిడతల బీభత్సం’ వీడియోను షేర్ చేశారు. ఈ మిడతలను చూస్తుంటే ఈ లాక్ డౌన్ లో అవి ప్రపంచ పర్యటనలో ఉన్నాయి అంటూ సెటైర్ వేశారు.

దీంతో చాలా మంది నెటిజన్లు.. వర్మకు ‘మిడతలు’ మంచి సబ్జెక్ట్ గా దొరికాయని.. ఆయన వాటితో సినిమా తీయండి అంటూ వర్మకు సూచిస్తున్నారు. వర్మ వరుస ట్వీట్స్ చూస్తుంటే నిజంగానే మిడతలపై సినిమా తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నట్టుగా పరిస్థితి ఉంది. మరి వర్మ ఏం చేస్తాడన్నది వేచిచూడాలి.