Begin typing your search above and press return to search.

వర్మ.. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క

By:  Tupaki Desk   |   19 April 2018 11:57 AM GMT
వర్మ.. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క
X
రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. దర్శకుడిగా ఆయనకున్న గొప్ప పేరంతా ఎప్పుడో పోయింది. సినిమాల్లో ఆయన ఎంత పతనం అయ్యారో ఎప్పట్నుంచో చూస్తున్నాం. దశాబ్దం కిందటే ఆయన అథమ స్థాయికి చేరుకున్నాడు. ఈ పదేళ్లలో కూడా ఆయన నుంచి ఎన్ని కళాఖండాలు వచ్చాయో తెలిసిందే. ఐతే దర్శకుడిగా ఎంత పతనం అయినప్పటికీ.. తన విలక్షణ వ్యక్తిత్వంతో ఫాలోవర్లను బాగానే సంపాదించుకున్నాడు. అప్పుడప్పడూ కొంచెం శ్రుతి మించి మాట్లాడినా.. అతి చేసినా.. హిపోక్రసీ లేకుండా సాగే ఆయన మాటతీరును అభిమానించేవాళ్లు.. ఆయనకు మద్దతిచ్చేవాళ్లు లేకపోలేదు.

అప్పుడప్పడూ ఆ తరహా అభిమానుల్ని.. మద్దతుదారుల్ని కూడా డిఫెన్స్‌లో పడేసేలా హద్దులు దాటి ప్రవర్తించడం.. మాట్లాడటం వర్మకు అలవాటు. ‘జీఎస్టీ’ గొడవలో వర్మ తీరు అలాగే ఆయన మద్దతుదారుల్ని ఇబ్బంది పెట్టింది. ఐతే ఇలాంటివి మామూలే కదా అని వాళ్లు సర్దుకుపోయారు. కానీ శ్రీరెడ్డి విషయంలో వర్మ చేసిందాన్ని మాత్రం ఎవ్వరూ సమర్థించలేని పరిస్థితి. ఈ విషయంలో వర్మ తీరు ఆయన వీరాభిమానులు సైతం అసహ్యించుకునే స్థాయిలో ఉందంటే అతిశయోక్తి కాదు. పవన్ కళ్యాణ్ ను బూతు తిట్టించడం వెనుక వర్మ ఎలాంటి కారణాలైనా చెప్పొచ్చు.. కానీ ఈ విషయంలో ఎవ్వరూ కన్విన్స్ అయ్యే పరిస్థితి లేదు. అది కేవలం కవరింగ్ లాగా ఉంది తప్ప ఆ కారణం ఎంత మాత్రం సహేతుకంగా లేదు. అలాగే శ్రీరెడ్డికి సురేష్ బాబుకు మధ్య డబ్బుల సెటిల్మెంట్ కోసం ప్రయత్నించినట్లు వర్మ చెప్పిన మాటలు కూడా నమ్మశక్యంగా లేవు. శ్రీరెడ్డి మాటల్ని బట్టి చూస్తుంటే వర్మ ఆ డబ్బులు డిమాండ్ చేయమని పురిగొల్పినట్లుగా ఉంది. వర్మకు ఎవరినో ఒకరిని గిచ్చడం.. ఏదైనా గొడవ జరుగుతుంటే వినోదం చూడటం సరదా.

ఐతే చిన్న చిన్న విషయాల వరకు అది ఓకే. కానీ ఇలాంటి సున్నితమైన అంశాల్లోనూ వర్మ ఇలా తలదూరుస్తాడని.. ఇంతగా దిగజారి ప్రవర్తిస్తాడని ఎవ్వరూ అనుకోవడం లేదు. తాను ఏం చేసినా మాటల మ్యాజిక్ తో.. లాజిక్కులతో సమర్థించుకోవడం వర్మకు అలవాటు. కానీ నిన్న 16 నిమిషాల పాటు సుదీర్ఘంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా.. కవరింగ్ చేయడానికి ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అంతా విన్న వాళ్లు వాస్తవమేంటో బాగానే అర్థం చేసుకున్నారు. ఒక కంక్లూజన్ కు వచ్చారు. ఇన్నాళ్లూ వర్మ ఏం చేసినా చెల్లింది. కానీ ఈసారి మాత్రం అలా కాదు. ఇది ఎంతమాత్రం క్షమార్హం కాదు. పవన్ కళ్యాణ్ అభిమానులు.. సినీ ప్రియులే కాదు.. మామూలు వ్యక్తులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వర్మను తప్పుబడుతున్నారు. తిట్టిపోస్తున్నారు. ఇకపై వర్మను జనాలు చూసే.. అతడితో వ్యవహరించే తీరే వేరుగా ఉంటే ఆశ్చర్యమేమీ లేదు.