Begin typing your search above and press return to search.

అతను అపాయింట్‌మెంట్‌ ఇస్తాడా వర్మా?

By:  Tupaki Desk   |   7 July 2015 7:29 AM GMT
అతను అపాయింట్‌మెంట్‌ ఇస్తాడా వర్మా?
X
నిజమే.. ఒకప్పుడు రామ్‌గోపాల్‌ వర్మ బాలీవుడ్‌లో ఎన్నో క్లాసిక్స్‌ తీశాడు. రంగీలా, సత్య, ఫ్యాక్టరీ, సర్కార్‌ లాంటి సినిమాలతో మొత్తం బాలీవుడ్‌ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. కానీ అదంతా గతం. ఇప్పుడు బాలీవుడ్‌లో మనోడికి ఏమాత్రం విలువ లేదన్నది వాస్తవం. ఒకప్పుడు అతడి దర్శకత్వంలో చేయడానికి తహతహలాడిన వాళ్లే ఇప్పుడు.. వర్మ పేరెత్తితే ఆమడ దూరం పారిపోతున్నారన్నది నిజం. ఒకప్పుడు వర్మ 'రంగీలా' సినిమాకు అవకాశమివ్వగానే ఎంతో ఇష్టంగా అందులో నటించిన అమీర్‌ఖాన్‌.. ఆ మధ్య వర్మ ఓ కథ చెబుతానంటే ఇదిగో అదిగో అంటూ తప్పించుకున్నట్లు వార్తలొచ్చాయి.

చివరగా బాలీవుడ్‌లో 'సత్య-2' లాంటి డిజాస్టర్‌ తీసిన వర్మ దాదాపు రెండేళ్లుగా ముంబయి ముఖమే చూడట్లేదు. మొగిలిపువ్వు హిందీ వెర్షన్‌ 'సీక్రెట్‌'తో మళ్లీ అక్కడ అడుగుపెట్టాలని చూస్తున్నాడు కానీ.. అది పెద్దగా వర్కవుటయ్యే అవకాశాలైతే కనిపించట్లేదు. ఐతే దీని సంగతి వదిలేసి.. మళ్లీ తన మార్కు సినిమాతో బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడట వర్మ. అందుకే సర్కార్‌ సిరీస్‌లో భాగంగా 'సర్కార్‌-3' తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఐతే తొలి రెండు భాగాల్లో నటించిన బచ్చన్‌లతో కాకుండా ఫ్రెష్‌గా రణబీర్‌ కపూర్‌తో ఈ సినిమా తీయాలని అనుకుంటున్నాడట వర్మ. ఐతే ఇప్పుడున్న పరిస్థితుల్లో రణబీర్‌ వర్మతో సినిమా చేయడం సంగతి అటుంచితే.. కథ వినడానికి అపాయింట్‌మెంట్‌ అయినా ఇస్తాడా అన్నది సందేహం. బచ్చన్‌లైనా వర్మ మీద అభిమానంతో మొహమాటం కొద్దీ ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవచ్చేమో కానీ.. రణబీర్‌ వర్మకు ఓకే చెబుతాడా అన్నది మాత్రం డౌటే.