Begin typing your search above and press return to search.

కన్నకొడుకు కాళ్లు పట్టుకున్న ఫైట్ మాస్టర్!

By:  Tupaki Desk   |   2 Jan 2022 10:30 AM GMT
కన్నకొడుకు కాళ్లు పట్టుకున్న ఫైట్ మాస్టర్!
X
రామ్ - లక్ష్మణ్ .. ఫైట్ మాస్టర్స్ గా ఈ ఇద్దరు అన్నదమ్ములకు మంచి క్రేజ్ ఉంది. ఎన్నో కష్టాలను .. బాధలను తట్టుకుంటూ, ఎన్నో అవమానాలను మనసులోనే దాచుకుంటూ వాళ్లు తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. చూడటానికి చాలా రఫ్ గా కనిపిస్తారుగానీ, వాళ్లు చాలా సెన్సిటివ్ అనే విషయం సన్నిహితులకు మాత్రమే తెలుస్తుంది. విమర్శలను .. పొగడ్తలను సమానంగా చూసుకుంటూ .. వినవిధేయతలకు కేరాఫ్ అడ్రెస్ కనిపిస్తుంటారు. వాళ్లను కదిలిస్తే జీవితసత్యాలు వినిపిస్తాయి .. వీళ్లలో ఇంతటి వేదాంతం దాగి ఉందా అనే ఆశ్యర్యాన్ని కలిగిస్తాయి.

తాజా ఇంటర్వ్యూలో రామ్ లక్ష్మణ్ సోదరులు పాల్గొన్నారు .. వారిలో ఒకరు మాట్లాడుతూ .. "మా చిన్నబ్బాయి 'ఆర్య' చాలా లావుగా అయ్యాడు. చదువుకోకుండా స్నేహితులతో కలిసి ఎక్కువగా తిరుగుతుండేవాడు. సిగరెట్లు కూడా తాగుతున్నాడని మా ఆవిడ చెప్పింది. ఏం చేయాలి? అనేది నాకు అర్థం కాలేదు . కాసేపు ధ్యానంలో కూర్చున్నాను. మా అబ్బాయేమో నేను వచ్చి కొడతానని భయపడుతున్నాడు. తండ్రిగా నేను వాడికి అన్నం పెడుతున్నాను కనుక వాడిని తిట్టే అధికారం .. కొట్టే అధికారం నాకు ఉన్నాయి.

ముందుగా తిడతాను .. అవసరమైతే కొడతాను. ఈ రెండూ కాకుండా ఇంకా ఏం చేయగలమనే ఆలోచన చేశాను. నిదానంగా వెళ్లి మా అబ్బాయి కాళ్లు పట్టుకున్నాను. 'ఒరేయ్ నీ గురించి అమ్మ ఇట్లా చెప్పింది. అందుకు నేను నిన్ను తిట్టొచ్చు .. కొట్టొచ్చు .. ఇంట్లో నుంచి బయటికి పంపించవచ్చు. నిన్ను మందలించవలసిన అధికారం .. బాధ్యత ఒక తండ్రిగా నాకున్నాయి. కానీ అవేమీ నేను చేయడం లేదు. ముందుగా నువ్వు మా గురించిన ఒక ఆలోచన చేయి. ఇండస్ట్రీలో రామ్ - లక్ష్మణ్ ఎలా ఉన్నారు? వాళ్ల స్థితిగతులేంటి? అనేది ఒకసారి ఆలోచించు.

అప్పుడు నీకు రామ్ - లక్ష్మణ్ కొడుకు ఎలా ఉండాలనేది అర్థమవుతుంది. అలా వాడికి ఆ విషయాన్ని నేను ఒక 10 నిమిషాలు చెప్పడం జరిగింది. దాంతో వాడు ఒక 6 నెలల్లో పూర్తిగా మారిపోయాడు. అంతకుముందు 120 కేజీలు ఉండే వాడు 70 కేజీలకు వచ్చేశాడు. మిగతా అన్ని చెడు అలవాట్లు మానేశాడు. పిల్లలు చెడు మార్గంలో వెళుతున్నప్పుడు .. ఒక రకమైన ద్వేషంతో ఉన్నప్పుడు మనం అదే అప్లై చేయకూడదు. అలా చేస్తే సమస్య తీరకపోగా, గొడవ మరింత పెద్దదవుతుంది. ప్రేమతో ప్రపంచాన్ని మార్చవచ్చును గానీ, ద్వేషంతో ఒక్కరినీ కూడా మార్చలేము" అంటూ చెప్పుకొచ్చారు.