Begin typing your search above and press return to search.

రామ్.. ఈ స్పీడేంటి బాబూ!

By:  Tupaki Desk   |   21 July 2015 4:57 PM GMT
రామ్.. ఈ స్పీడేంటి బాబూ!
X
ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, మసాలా.. మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి ఫ్లాపవడంతో బాగా డీలా పడిపోయిన ఎనర్జిటిక్ హీరో రామ్ కు ‘పండగ చేస్కో’ ఊరటనిచ్చింది. ఐతే ఈ సినిమా విడుదల కాకముందే రెండు సినిమాలకు ఓకే చేసి.. షూటింగ్ కూడా మొదలెట్టాడు రామ్. ఈ రెండూ కూడా కొత్త దర్శకులతోనే కావడం విశేషం. అందులో ఒకటి మాటల రచయిత కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్న ‘హరికథ’ కాగా.. ఇంకోటి సురేందర్ రెడ్డి దగ్గర అసిస్టెంటుగా పని చేసిన శ్రీనివాసరెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా.

ఇందులో ‘శివమ్’ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిపోవడం విశేషం. రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదలై మూడు నెలలు కాలేదు. అప్పుడే పాటలు మినహా మొత్తం పూర్తి కావచ్చింది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న షెడ్యూల్ తుది దశలో ుంది. ఇంకొన్ని రోజుల్లో పాటల చిత్రీకరణ కోసం ఫారిన్ షెడ్యూలుకు వెళ్తోంది యూనిట్. ఇందులో రామ్ సరసన రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు రిలీజ్ డేట్ కూడా ఇచ్చేయడం విశేషం. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. హరికథ కూడా ఈ ఏడాది ఆఖర్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.