Begin typing your search above and press return to search.

అప్పుడు మహేష్.. ఇప్పుడు రామ్

By:  Tupaki Desk   |   3 Oct 2015 9:30 AM GMT
అప్పుడు మహేష్.. ఇప్పుడు రామ్
X
తెలుగు ప్రేక్షకులు అంతే మరి. ఎప్పుడు ఏ సినిమాను ఆదరిస్తారో.. ఏ సినిమాను తిప్పికొడతారో చెప్పలేం. లౌక్యం రొటీన్ సినిమానే అన్నారు, కానీ హిట్ చేశారు.. అంతకుముందు రభస కూడా ఈ టైపు సినిమానే, కానీ దాన్ని తొక్కి పడేశారు. పాత కథల్ని రీసైకిల్ చేసినపుడు కొంచెం తెలివిగా వ్యవహరించాలి. కథ ‘రొటీన్’ అనిపించినా కథనంలో ఏదో ఒక కొత్తదనం చూపించాలి. అలా కాకుండా తీసిందే తీస్తాం.. మీకింతకంటే అవసరం లేదు అన్నట్లు ప్రేక్షకుడిని చులకనగా చూస్తే ఆ సంగతి అర్థం చేసుకోలేని అమాయకుడేం కాదు ప్రేక్షకుడు. ఇలా రచయితలు, దర్శకులు అతి తెలివిని ప్రదర్శించినపుడు దిమ్మదిరిగే షాకులివ్వడం ఆడియన్స్ కు అలవాటే.

లాస్ట్ ఇయర్ మహేష్ బాబుకు ఏమైందో అందరికీ తెలిసిందే. ‘1 నేనొక్కడినే’ లాంటి భిన్నమైన సినిమా చేశాడు మహేష్. అది మంచి సినిమానే అయినా దాన్ని జనాలు ఆదరించలేదు. దీంతో ‘ఆగడు’ లాంటి పరమ రొటీన్ సినిమా తీశాడు. ‘దూకుడు’ సినిమానే ఇంకోసారి చూపించాడు. ఈ వ్యవహారం చూస్తే ఎలా ఉందంటే.. నేను కొత్త సినిమా చేస్తే చూడరా.. మీకీ రొటీన్ సినిమానే కరెక్ట్ అన్నట్లు ‘ఆగడు’ వదిలినట్లు అనిపించింది. జనాలు ఊరుకుంటారా? తిప్పికొట్టారు. ఐతే ‘ఆగడు’ తన కెరీర్ లో చేసిన అతి పెద్ద మిస్టేక్ అని ఆ తర్వాత మహేష్ నిజాయితీగా ఒప్పుకున్నాడు.

శివమ్ రిలీజ్ కు ముందు ప్రెస్ మీట్ లలో తాను కొత్తగా చేసిన సినిమాల్ని జనాలు ఆదరించలేదని.. అందుకే రొటీన్ సినిమాలు చేస్తున్నానన్నట్లు తేలిగ్గా మాట్లాడాడు రామ్. కానీ ఇప్పుడు ‘శివమ్’ సినిమా విషయంలో ఏమవుతోందో అందరూ చూస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకుల ఫ్రస్టేషన్ మామూలుగా లేదు. కనీసం లాజిక్ లేకుండా ప్రేక్షకులంటే మరీ చులకన భావంతో తీసినట్లుంది ఈ సినిమా. అందుకే జనాల నుంచి దారుణమైన టాక్ వస్తోంది. మరి ‘ఆగడు’ మిస్టేక్ నుంచి మహేష్ పాఠాలు నేర్చుకున్నట్లే.. ‘శివమ్’ తర్వాత రామ్ కు కూడా జ్నానోదయం అవుతుందేమో చూడాలి.