Begin typing your search above and press return to search.

ఇక డాన్సులు.. ఫైట్లు చేయలేనేమో అనుకున్నాను: రామ్

By:  Tupaki Desk   |   11 July 2022 4:34 AM GMT
ఇక డాన్సులు.. ఫైట్లు చేయలేనేమో అనుకున్నాను: రామ్
X
రామ్ తాజా చిత్రంగా లింగుసామి దర్శకత్వంలో 'ది వారియర్' రూపొందింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. రామ్ తన కెరియర్లో ఫస్టు టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమా ఇది. ఆయన జోడీగా కృతి శెట్టి నటించిన ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించారు. ఈ వేదికపై హీరో రామ్ మాట్లాడుతూ .. " ఈ సినిమా జర్నీయే చాలా డిఫరెంట్ గా మొదలైంది.

పోలీస్ పాత్రను చేయాలనే ఉద్దేశంతో కథలు వినడం మొదలుపెట్టాను. 5 కథలవరకూ విన్న తరువాత అన్నీ ఒకే రకంగా ఉన్నట్టుగా అనిపించింది. దాంతో పోలీస్ పాత్రను చేయాలనే ఆలోచనను పక్కన పెట్టేద్దాం అనుకున్నాను. అలాంటి సమయంలో లింగుసామి గారు వచ్చారు. పోలీస్ కథతో వచ్చినట్టుగా చెప్పగానే .. ఏదో ఫార్మాలిటీగా విందాములే అనుకున్నాను. ఆయన కథ చెప్పిన తరువాత .. పోలీస్ కథ అంటూ చేస్తే ఇలాంటి కథనే చేయాలని అనిపించింది.

కథ వినగానే నేను ఎప్పుడూ కూడా వెంటనే ట్వీట్ పెట్టలేదు .. కానీ ఈ సినిమాకి మాత్రం ట్వీట్ పెట్టాను. కొన్ని యథార్థ సంఘటనల నుంచి ఆయన ఈ సోల్ ను పట్టుకున్నారు. రియల్ పోలీస్ ఆఫీసర్స్ కి సంబంధించిన కథలన్నీ కలిపి ఆయన ఈ సినిమాలో హీరో పాత్రను రాశారు.

అందువలన ఆ పాత్రను చేయడం నాకు థ్రిల్ గా అనిపించింది. అందుకు లింగుసామిగారికి నేను హ్యాట్సాఫ్ చెబుతున్నాను. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఎమోషన్ ఉంటుంది.

ఈ సినిమా కోసం రోజుకి రెండుసార్లు జిమ్ చేస్తున్నప్పుడు స్పైనల్ కార్డు దగ్గర కాస్త ఇబ్బంది కలిగింది. రెండు మూడు వారాలు దాటినా తగ్గకపోతే డాక్టర్ ను అడిగాను. 'మీకు సినిమా ముఖ్యమా? .. లైఫ్ ముఖ్యమా? అని ఆయన అడిగారు.

ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఇంటికి వచ్చాను. నా అభిమానులంతా రిస్క్ చేయవద్దనే ట్వీట్ చేశారు. వాళ్లు లేనిదే నేను లేనని నాకు అర్థమైంది. అంత పెయిన్ లోను నేను డాన్సులు .. ఫైట్లు చేశానంటే దానికి కారణం మీరే" అంటూ చెప్పుకొచ్చాడు.