Begin typing your search above and press return to search.

ఎక్స్ క్లూసివ్ ఇంటర్ వ్యూ : నేను ఇప్పుడు ప్రేమలో ఉన్నా - రామ్ పోతినేని

By:  Tupaki Desk   |   25 Oct 2017 5:41 AM GMT
ఎక్స్ క్లూసివ్ ఇంటర్ వ్యూ : నేను ఇప్పుడు ప్రేమలో ఉన్నా - రామ్ పోతినేని
X
మోడ్రన్ దేవదాసు రామ్ పోతినేని అక్టోబర్ 27న ఉన్నది ఒకటే జిందగీ అనే స్వీట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల్ని మరోసారి పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సందర్భంగా తుపాకీ టీమ్ రామ్ స్పెషల్ చిట్ చాట్..!

* ఎనర్జీటిక్ స్టార్ కాస్తా లవర్ బాయ్ అయిపోతున్నాడు రోజు రోజుకి ఎందుకలా?

(నవ్వుతూ) ఈ ఇమేజ్ లు సక్సెస్ ఉంటేనే ఉంటాయి, దేవదాసు - జగడం - మస్కా ఇలా ఫుల్ కమర్షీయల్ సినిమాలు చేసినప్పుడు ఎనర్జీటిక్ స్టార్ అన్నారు. మొన్న నేను శైలజ హిట్ అవ్వడం ఇప్పుడేమో ఉన్నది ఒకటే జిందగీ కూడా అదే ఫ్లేవర్ లా అనిపించడంతో లవర్ బాయ్ అనేస్తున్నారు. అప్పుడెప్పుడో ఎందుకంటే ప్రేమంట అనే స్వీట్ లవ్ స్టోరీ కూడా చేశాను, మరి అప్పుడెవరూ నన్ను లవర్ బాయ్ అనలేదే!

* మీ ప్రతి సినిమా ప్రేమ నేపథ్యంగానే తెరకెక్కుతుంటాయి, ప్రేమంటే ఎందుకంత ఇష్టం?

నా సినిమాలే కాదు ఫిల్మ్ ఇండస్ట్రీలో తెరకెక్కే తొంభై శాతం సినిమాల్లో ప్రేమ ఉంటోంది. లవ్ ఈజ్ ఏన్ యూనివర్సల్ ఫ్యాక్టర్ - ప్రేమ లేకపోతే నా సినిమాలే కాదు యావత్ ప్రపంచమే లేదు. అందుకే నా సినిమాల్లో ప్రేమకి అంత విలువ ఇస్తాను.

* ప్రేమకి అంత విలువిచ్చే మిమల్ని ప్రేమలోకి దింపిన ముచ్చటేమైనా ఉందా?

నేను ఇప్పుడు కూడా లవ్ లో ఉన్నాను. ప్రస్తుతానికి సినిమాల్ని ప్రేమిస్తున్నాను - మొన్న ఆ మధ్య నేను శైలజ సినిమాలో శైలజ పాత్రను ప్రేమించాను - ఆ సినిమాను నాకు తగ్గట్లుగా తెరకెక్కించిన డైరెక్టర్ కిషోర్ తిరుమలను ప్రేమిస్తున్నాను - ఇక ఇప్పుడు ఉన్నది ఒకటే జిందగీ స్టోరీతో లవ్ లో ఉన్నాను. ఇక నా ప్రతి అడుగులో తోడుండే నా కుటుంబ సభ్యులు అందర్నీ, నన్ను ఇన్నేళ్లుగా ఆదరిస్తున్న అభిమానుల్ని ప్రేమిస్తున్నాను - ప్రేమిస్తున్నే ఉంటాను.

* అందుకేనా దేవదాసుగా కూడా బాగా నటిస్తున్నారు?

(నవ్వులు) నా ఫస్ట్ మూవీ దేవదాసులో నా క్యారెక్టర్ చాలా ఎనర్జీటిక్ గా ఉంటుంది, ఆ ఎనర్జీతోనే పాతకాలం దేవదాసు మాదిరిగా మందు కొడుతూ మూలన పడుకోకుండా - అమెరికా వెళ్లి తన పారూను సొంతం చేసుకుంటాడు. గొప్ప ప్రేమికుడు అంటే ప్రేమను త్యాగం చేసేవాడు కాదని నా ఫీలింగ్.

* ప్రేమకి తొలిమెట్టు స్నేహం అంటారు - దీనికి మీరు ఒప్పుకుంటారా?

ఈ పాయింట్ కి కాస్త అటు ఇటుగా మా ఉన్నది ఒకటే జిందగీ తెరకెక్కింది. ఫ్రెండ్ షిప్ వేరు ప్రేమ వేరు అని నా నమ్మకం. ఈ రెండిటి మధ్య ఉండే తేడాని తెలుసుకునే కంటే రెండిటిని ఆస్వాదించడం మేలు. అందుకే ఈ రెండు పాయింట్లని సినిమాలో వేరు వేరుగా చూపించే ప్రయత్నం చేశాము. చిన్ని చిన్ని డైలాగ్స్ తో లవ్ అండ్ ఫ్రెండ్ షిప్ మధ్య ఉండే తేడా చాలా సింపుల్ గా కన్వే చేశాడు కిషోర్ తిరుమల.

* వాట్ అమ్మ వాట్ ఈజ్ దిస్ అమ్మా పాట చాలా ఫేమెస్ అయింది - ఈ పాటలో ఆ పదాలు పెట్టడానికి ఏదో తెరవెనుక నేపథ్యం ఉందట నిజమేనా?

(నవ్వులు... చాలా నవ్వులు తరువాత) ఆ మాటలెవరివో మీకు తెలుసు - కానీ ఇదంతా వట్టి రూమర్స్ మాత్రమే. ఈ పాట ద్వారా ఎవ్వరిని కించపరిచే ఉద్దేశం మా చిత్ర బృందానికి లేదు. ఈ లిరిక్స్ దేవి కంపోజ్ చేసిన ట్యూన్స్ ని బేస్ చేసుకొనే రాయించడం జరిగింది.

* వరుస హిట్లు రావడం లేదంటని ఎప్పుడైనా అనిపించిందా?

అప్పుడప్పుడు అనిపిస్తోంది. కానీ ఇలా మధ్యలో దెబ్బలు తగిలిన ప్రతిసారీ మళ్లీ గెలవాలనే కసితో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాను. అయితే నా సినిమాలకు వచ్చే రిజల్ట్స్ తో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించడమే నా నిజమైన సక్సెస్.

* ఇండస్ట్రీలో కాంపిటీషన్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది, ఈ పోటిని తట్టుకోవడం ఎలా అని ఎప్పుడైనా ఆలోచించారా?

ఇక్కడకు ఎంతమంది వచ్చినా - టాలెంట్ ఉన్నవారే నిలబడతారు. డబ్బు - అందం ఉంది కదా నేను హీరోగా సెటిల్ అయిపోవచ్చు అనుకుంటే ఇండస్ట్రీలో ఎదగలేము. జనాల్ని మెప్పించేందుకు చాలా కష్టపడాలి. ఆ కష్టం కూడా ఇష్టంగా అనుభవించాలి. సరైన కథల్ని - పాత్రల్ని ఎంచుకోవడం దగ్గర నుంచి సెల్ఫ్ ప్రమోషన్ వరుకు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తేనే ఇక్కడ నిలబడగలం.

* వివాదాలు చుట్టూనే నేటి సినిమా ప్రచారం తిరుగుతోంది. ఇది కరెక్టే అంటారా?

ఈ సినిమా హిట్ అయితే చాలు మనం గట్టెక్కెచ్చనుకునే వారు వివాదాలతో ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఇండస్ట్రీలో నేను నిలబడాలి అనుకునే ప్రతి ఆర్టిస్ట్ వివాదాలకు దూరంగా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం.

* అందుకేనా మీడియాకి దూరంగా ఉంటారు?

(నవ్వులు) మీరు ఇప్పుడు నన్ను ఏదొక వివాదంలోకి లాగేందుకు నిర్ణయించుకున్నారా ఏంటి? మీడియాకి నేను ఎందుకు దూరంగా ఉంటాను. నా సినిమాను నేను బాగానే ప్రమోట్ చేసుకుంటాను. ఫిల్మ్ నగర్ కి నా ఇల్లే దూరం నేను మీడియాకి దగ్గరగానే ఉంటాను(మళ్లీ నవ్వులు)

* సొంత బ్యానర్ లోనే ఎక్కువ సినిమాలు చేయడానికి కారణం?

నేను ఎంచుకునే కథల్ని బయట నిర్మాతల కంటే పెదనాన్నే ఎక్కువుగా నమ్ముతున్నారు. అందుకే అలా కుదిరిపోతుంది(నవ్వులు).

* హిట్ కథలన్ని హోమ్ బ్యానర్ కే రిఫర్ చేస్తున్నారనుకోవచ్చా?

(నవ్వులే నవ్వులు) మా హోమ్ బ్యానర్ కు నా వల్లే లాస్ నా వల్లే లాభాలు. శివమ్ తో వచ్చి లాస్ ఇచ్చి ఆ తరువాత నేను శైలజతో లాభాలు తెచ్చాను. కాబట్టి నేను హిట్ అనుకున్న కథలు రవిగారికి రిఫర్ చేస్తాను అనడం న్యాయం కాదు. ఎందుకంటే నేను ఎంచుకుని మా బ్యానర్ లోనే నిర్మించిన చాలా కథలు ప్రేక్షకుల్ని ఆశించినంత స్థాయిలో మెప్పించ లేకపోయాయి. అయితే మా బ్యానర్ లో సినిమాలు ఎక్కువగా చేయడానికి కారణం మిగతా నిర్మాతలకంటే మా వాళ్లు నా పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. సినిమాను నిర్మించడంలోనే కాదు డిస్ట్రీబ్యూషన్. పబ్లిసిటీ తదితర విషయాల్లో కూడా ఏ మాత్రం రాజీ పడరు. ఐ ఫీల్ కంఫర్ట్ టు వర్క్ ఇన్ అవర్ హోమ్ బ్యానర్.

* ఇంతకి ఉన్నది ఒకటే జిందగీ హిట్ కథంటారా?

హిట్ కథే అనుకుంటున్నాను. కిషోర్ తిరుమల టేకింగ్ - దేవిశ్రీ మ్యూజిక్ - అనుపమ - లావణ్య గ్లామర్ - మా హోమ్ బ్యానర్ ప్రొడక్షన్ వాల్యుస్ - మేం చేస్తున్న పబ్లిసిటీ వెరసి ప్రేక్షకుల్ని మెప్పిస్తాయని భావిస్తున్నాను. చూడాలి ఏం జరుగుతుందో!