Begin typing your search above and press return to search.

బోయపాటిని లైన్లో పెట్టేసిన రామ్!

By:  Tupaki Desk   |   7 Feb 2022 4:11 AM GMT
బోయపాటిని లైన్లో పెట్టేసిన రామ్!
X
బోయపాటి .. బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' సంచలన విజయాన్ని సాధించింది. 103 థియేటర్స్ లో ఈ సినిమా 50 రోజుల పండుగ జరుపుకోవడం విశేషం. డిసెంబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా, కొన్ని థియేటర్స్ లో సంక్రాంతికి కూడా హౌస్ ఫుల్ వసూళ్లతో నడించింది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి ప్రభంజనాన్ని సృష్టించిన సినిమా ఇదేననే అభిప్రాయాన్ని అంతా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందనీ, అయితే అందుకు సమయం పడుతుందని బోయపాటి చెప్పడం నందమూరి అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించింది.

ఈ నేపథ్యంలో బోయపాటి తన తదుపరి సినిమాను అల్లు అర్జున్ తో చేయాలని అనుకున్నాడు. అందుకు సంబంధించిన కథపై చర్చలు కూడా పూర్తయ్యాయి. అల్లు అరవింద్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. గీతా ఆర్ట్స్ లో ఈ సినిమా మొదలుపెట్టడానికి సన్నాహాలు కూడా మొదలయ్యాయి. అయితే 'పుష్ప' సీక్వెల్ ను కాస్త గ్యాప్ ఇచ్చి చేద్దామని అనుకున్న బన్నీ, ఆ తరువాత మనసు మార్చుకున్నాడు. నెక్స్ట్ ప్రాజెక్టుగా 'పుష్ప' సీక్వెల్ నే చేయాలని నిర్ణయించుకున్నాడు. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

దాంతో బోయపాటి మరో హీరోతో మరో ప్రాజెక్టును సెట్ చేసుకోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు యంగ్ హీరోలంతా కూడా ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్టులన్నీ కూడా మధ్యలో ఉన్నాయి. అయితే రామ్ సినిమా 'ది వారియర్' మాత్రం ముగింపు దశకి చేరుకుంది. లింగుసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, ఆయన జోడీగా కృతి శెట్టి అలరించనుంది. ఈ సినిమా తరువాత రామ్ .. బోయపాటితో ముందుకు వెళ్లడానికి ఉత్సాహాన్ని చూపించాడు. దాంతో ఇద్దరి మధ్య కథా చర్చలు పూర్తయ్యనీ .. ఈ ప్రాజెక్టు ఖరారు అయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

రామ్ ఈ మధ్య మాస్ ఇమేజ్ ను కోరుకుంటున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్' తరువాత ఆయనలో ఆ కోరిక మరింత బలపడింది. 'రెడ్' సినిమాలోను ఆయన మాస్ కంటెంట్ ఉండేలా చూసుకున్నాడు. ఇక లింగుసామికి తమిళంలో మాస్ డైరెక్టర్ గా మంచి పేరు ఉంది. అందువల్లనే ఆయనను రంగంలోకి దింపేసి ఆ సినిమాను కానిచ్చేస్తున్నాడు. బోయపాటితో సినిమా చేస్తే మాస్ హీరోగా ఆయన ఏ స్థాయిలో బూస్టప్ ఇస్తాడనేది రామ్ కి తెలుసు. అందువలన బోయపాటిని ఆయన లైన్లో పెట్టేశాడని అంటున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.