Begin typing your search above and press return to search.

మ‌హాన‌టిలో త‌ప్పుల్ని చెప్పిన ప్ర‌ముఖ న‌టి

By:  Tupaki Desk   |   4 Jun 2018 5:00 AM GMT
మ‌హాన‌టిలో త‌ప్పుల్ని చెప్పిన ప్ర‌ముఖ న‌టి
X
మ‌హాన‌టి మూవీని బ‌యోపిక్ మాదిరి కాకుండా ఒక మామూలు సినిమాగా చూస్తే.. వంక పెట్టాల్సిన అవ‌స‌ర‌మే లేదు. కానీ.. చిక్కంతా ఒక లెజెండ‌రీ న‌టి జీవితాన్ని ఆవిష్క‌రించేందుకు సినిమా తీసిన‌ప్పుడే ఇబ్బంది అంతా. ఎందుకంటే.. కాల్ప‌నిక క‌థ‌లో లాజిక్ మిస్ కాకుంటే ఎవ‌రూ ఏమీ అన‌లేరు. కానీ.. బ‌యోపిక్ విష‌యంలో వాస్త‌వానికి దూరంగా ఉండే అంశాల‌తో పాటు.. అంద‌రికి సుప‌రిచిత‌మైన అంశాన్ని క‌థ‌గా తీసుకున్న‌ప్పుడు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాల్సిందే.

రెండు వంద‌ల ఏళ్లు.. మూడు వంద‌ల ఏళ్లు అంటే భిన్నాభిప్రాయాల‌కు అవ‌కాశం ఉంటుంది.అలా కాకుండా సావిత్రి స‌మ‌కాలీనులు ఎంతో మంది ఇంకా ఉండ‌టంతో పాటు.. ఆమె ఇప్ప‌టికి తెలుగు సినీ అభిమానుల మ‌నుస్మృతి నుంచి పోని వేళ‌.. సినిమా తీయ‌టమంటే క‌త్తి మీద సామే.

బ‌యోపిక్ లో తెర కెక్కించే ప్ర‌తి అంశాన్ని ఒక‌టికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే.. బోలెడంత రీసెర్చ్ చేసిన‌ట్లుగా చెప్పిన త‌ర్వాత కూడా సినిమాలో భారీగా త‌ప్పులుంటే క్ష‌మార్హం కాదు. సినిమా ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కావ‌టంతో పాటు.. సూప‌ర్ స‌క్సెస్ అయి ఉండొచ్చు. వాణిజ్య ప‌రంగా కూడా బోలెడ‌న్ని డ‌బ్బుల్ని మిగిల్చి ఉండొచ్చు. కానీ.. మ‌చ్చ‌ల మాదిరి త‌ప్పులు సినిమాన వెంటాడుతూనే ఉంటాయ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

మ‌హాన‌టిలో ఫ్యాక్చువ‌ల్ ఎర్ర‌ర్స్ ఎన్ని ఉన్నాయ‌న్న అంశం మీద ఇప్ప‌టికే ఒక ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక ఫుల్ పేజీ ఆర్టిక‌ల్ రాసేసి.. ఒక్కొక్క త‌ప్పును వివ‌రంగా రాసేశారు.

ఇదిలా ఉంటే ఇప్ప‌టికే జెమినీ గ‌ణేశ‌న్ కుమార్తె సినిమాపై అసంతృప్తి వ్య‌క్తం చేయ‌టం మ‌ర్చిపోకూడ‌దు. త‌న తండ్రిని త‌ప్పుగా చూపించిన‌ట్లుగా ఆరోపించారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రో సినీ ప్ర‌ముఖురాలు.. హీరోయిన్ గా మొద‌లుకొని క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ క‌మ్‌ సీనియ‌ర్ న‌టి ర‌మాప్ర‌భ మ‌హాన‌టిలో త‌ప్పుల్ని ఎత్తి చూపించారు. మ‌హాన‌టి మూవీలో చాలా త‌ప్పులున్నాయ‌న్నారు. రాజేంద్ర‌ప్ర‌సాద్ పోషించిన కేవీ చౌద‌రి పాత్ర‌ను చాలా ఉదాత్తంగా చూపించార‌ని.. వాస్త‌వంలో కేవీ చౌద‌రిలో చాలా నెగిటివ్ షేడ్స్ ఉన్న విష‌యాన్ని వెల్ల‌డించారు. సావిత్రిని మ‌ద్యానికి బానిస చేసింది కేవీ చౌద‌రిగా ఆమె చెప్పారు. సినిమాలో 70 శాతం త‌ప్పులే ఉన్నాయ‌ని.. సావిత్రితో దాదాపు ప‌దేళ్ల పాటు అత్యంత స‌న్నిహితంగా గ‌డిపిన త‌న‌ను సంప్ర‌దించ‌కుండా సినిమా చేసిన‌ప్పుడే మ‌హాన‌టిలో త‌ప్పులు మొద‌లయ్యాయ‌ని ఆమె చెప్పారు.

మ‌హాన‌టి అని పేరు పెట్టాక ఎవ‌ర్ని సంప్ర‌దించాల‌నే అంశంపై సినిమాను నిర్మించిన వారిలో ఇగో క‌నిపిస్తోంద‌ని.. ఎవ‌ర్ని క‌లిస్తే నిజాలు బ‌య‌ట‌ప‌డ‌తాయో తెలిసినా.. త‌మ‌లాంటోళ్ల‌ను క‌ల‌వ‌లేద‌న్నారు. మ‌హాన‌టి సినిమా నూటికి నూరుపాళ్లు బిజినెస్ అని.. అందుకే వాళ్ల‌కు న‌చ్చిన‌ట్లుగా తీసుకున్నార‌న్నారు. జెమినీ గ‌ణేశ‌న్ చాలా మంచివాడ‌ని.. అయితే.. సావిత్రే త‌న మొండిత‌నంతో అంద‌రిని దూరం చేసుకున్న‌ట్లుగా ర‌మాప్ర‌భ చెప్పారు.

సావిత్రి లాంటి మొండిత‌నం ఉన్న న‌టిని తాను చూడ‌లేద‌న్న ర‌మాప్ర‌భ‌.. జెమినీ మామ‌ది త‌ప్పు లేదు. త‌ప్పంతా సావిత్రిదే. కేవ‌లం మొండిత‌నంతోనే త‌న‌కు తాను చెడు చేసుకుంది. జెమినీ గోడ దూకి పారిపోయిన టైంలో నేనున్నా. కుక్క‌ల్ని ఉసిగొల్పిన‌ప్పుడు కూడా నేను అక్క‌డే ఉన్నా. అలా అనుకుంటే సావిత్రి గురించి కూడా ఏదో ఒక‌టి చెబుతుంటారు. అది అబ‌ద్ధ‌మ‌ని చెబుతా. అందుకే.. నాలాంటిదాన్ని సినిమాల్లో లేకుండా చేశారు అంటూ ర‌మాప్ర‌భ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక‌పై బ‌యోపిక్ లు చేసేట‌ప్పుడు త‌న లాంటి సీనియ‌ర్ల‌ను సంప్ర‌దించాల‌న్నారు. ఓప‌క్క ఫ‌క్తు వ్యాపార‌మ‌న్న విష‌యాన్ని ర‌మాప్ర‌భకు అర్థ‌మ‌య్యాక కూడా.. బ‌యోపిక్ లు తీసే వాళ్లు సీనియ‌ర్ల‌ను సంప్ర‌దించాల‌న‌టంలో అర్థం లేద‌ని చెప్పాలి. తీసేది వ్యాపారం కోస‌మైన‌ప్పుడు జ‌రిగింది జ‌రిగిన‌ట్లు తీస్తారా ఏంటి?