Begin typing your search above and press return to search.

మరొక డైరెక్టర్ ని టార్గెట్ చేస్తున్నారు!

By:  Tupaki Desk   |   30 July 2022 6:30 AM GMT
మరొక డైరెక్టర్ ని టార్గెట్ చేస్తున్నారు!
X
సినిమాలు మరియు రాజకీయాలను వేర్వేరుగా చూడాలని చెబుతుంటారు. అయితే ఇటీవల కాలంలో ఈ రెండింటికీ ముడి పెడుతూ సోషల్ మీడియాలో విపరీతమైన దుష్ప్రచారం చేస్తుండటం చూస్తున్నాం. కాకపోతే దీని వల్ల ఫైనల్ గా సినిమాకే నష్టం జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

నితిన్ హీరోగా నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ట్వీట్ల వ్యవహారం ఇటీవల ఎంత దుమారం రేపిందో తెలిసిందే. అతను కమ్మ - కాపు కులాలను దూషిస్తూ గతంలో ట్వీట్లు పెట్టినట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అలానే ఏపీలోని అధికార వైఎస్సార్సీపీ కి సపోర్ట్ గా.. ప్రతిపక్ష టీడీపీ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేసినట్లు ట్వీట్లు ఉన్నాయి. దీంతో దర్శకుడిని లక్ష్యంగా చేసుకుని ఆయా వర్గాల అభిమానులు ట్రోల్ చేశారు. 'మాచర్ల నియోజకవర్గం' సినిమాని బాయ్‌ కాట్ చేయాలని మాచర్ల ముచ్చట్ల పేరుతో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. టీడీపీ కి మద్దతుగా నిలిచే కొన్ని ప్రధాన మీడియాలలో ఇదే ప్రధాన శీర్షిక అయింది.

అయితే తన పేరు మీద నకిలీ ట్వీట్లు సృష్టించి కులాలు మరియు వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని.. తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలని రాజశేఖర్ రెడ్డి సైబర్ పోలీసులను ఆశ్రయించారు. అవన్నీ ఫేక్ పోస్టులు అని.. ఎవరూ నమ్మవద్దని కోరాడు. ఎవరో కావాలని ఎడిట్ చేసి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని అన్నాడు.

తాను స్వతహాగా వైఎస్సార్ అభిమానినని.. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు తన అభిప్రాయాన్ని చెప్పానే తప్ప.. వేరే ఏ కులాన్ని కించపరచలేదని 'మాచర్ల' దర్శకుడు వివరణ ఇచ్చాడు. ఆ సమయంలో నేను చేసిన ట్వీట్ ని ఒక్కటి కూడా డిలీట్ చేయలేదని పేర్కొన్నాడు. ఆగస్ట్ 12న సినిమా రిలీజ్ ఉండటంతో దీని ప్రభావం ఏమైనా పడుతుందేమో అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది.

అయితే ఇప్పుడు 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన శరత్ మండవ మీద కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. సినిమాలో కొన్ని డైలాగులు ఏపీ సర్కారును టార్గెట్ చేసేలా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు శరత్ తెలుగుదేశం పార్టీ మద్దతుదారనే విషయం అతని పాత ట్వీట్లు చూస్తే అర్థమవుతుంది.

గతంలో అతను నారా లోకేష్‌ కు మద్దతుగా.. వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా శరత్ ట్వీట్లు పెట్టినట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చాయి. దీంతో ఓ వర్గం అభిమానులు రామారావు దర్శకుడిపై సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు. సినిమాని బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడం లేదు కానీ.. 'మాచర్ల' దర్శకుడు ఇష్యూని అంత హైలైట్ చేసిన ప్రధాన మీడియా.. ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉందని ప్రశ్నిస్తున్నారు.

అప్పుడు వైసీపీ వ్యతిరేకులంతా 'మాచర్ల నియోజకవర్గం' దర్శకుడిని టార్గెట్ చేస్తే.. ఇప్పుడు టీడీపీ వ్యతిరేకులు అందరూ 'రామారావు' డైరెక్టర్‌ ను లక్ష్యంగా చేసుకున్నారు. శరత్ మండవ సినిమాకు ఫస్ట్ డే నెగెటివ్ టాక్ వచ్చింది వచ్చింది కాబట్టి.. దీనికి ఇప్పుడు కొత్తగా జరిగే డ్యామేజ్ ఏమీ లేకపోవచ్చు. మరి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసిన 'మాచర్ల నియోజకవర్గం' పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.