Begin typing your search above and press return to search.

'ఆచార్య' నన్ను బాగానే టెన్షన్ పెట్టాడు: చరణ్

By:  Tupaki Desk   |   2 Dec 2021 4:03 AM GMT
ఆచార్య నన్ను బాగానే టెన్షన్ పెట్టాడు: చరణ్
X
చిరంజీవి - కొరటాల కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందింది. నిరంజన్ రెడ్డి - చరణ్ నిర్మించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయనున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఇంతవరకూ రెండు పాటలు వదిలారు. చిరంజీవి నుంచి వదిలిన 'లాహే లాహే' .. చరణ్ నుంచి వదిలిన 'నీలాంబరి' సాంగ్ ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాయి. చిరంజీవి - చరణ్ కాంబినేషన్లో కూడా ఒక పాట ఉంటుందనీ, ఆ పాట ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని కొరటాల చెప్పడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఇక చిరంజీవి - చరణ్ కాంబినేషన్ లోని సీన్స్ పై కట్ చేసిన ట్రైలర్ ను కూడా త్వరలో వదలనున్నారు. చిరంజీవి సరసన నాయికగా కాజల్ కనిపించనుండగా, చరణ్ జోడీగా పూజ హెగ్డే కనువిందు చేయనుంది. ఈ సినిమాలో చిరంజీవి - చరణ్ ఇద్దరూ కూడా నక్సలైట్ల పాత్రలను పోషించారు. అవినీతిని అంతమొందించడం కోసం ఆయుధం పట్టిన పోరాట వీరులుగా వాళ్లు కనిపించనున్నారు. ఇటీవల చరణ్ పాత్రకి సంబంధించిన స్పెషల్ టీజర్ వదలగా, దానికి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. చిరూ .. చరణ్ లకు సింబాలిక్ గా, చిరుతపులిని .. చిరుత పిల్లను చూపించడం అభిమానులకు ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది.

చిరంజీవి సినిమాల్లో ఇంతకు ముందు చరణ్ తళుక్కున మెరిశాడు గానీ, ఆయనతో కలిసి ఎక్కువ నిడివిగల పాత్రను పోషించడం ఇదే ప్రథమం. తాజా ఇంటార్వ్యులో చరణ్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. నాన్నతో కలిసి నటించడం అంటే కాస్త టెన్షన్ గానే ఉంటుంది. అయితే నటుడిగా సుదీర్ఘమైన ఆయన అనుభవం .. 150 సినిమాలకి పైగా సీనియారిటీ నన్ను మరింత టెన్షన్ పెట్టాయి. ఆ టెన్షన్ ను ఎప్పటికప్పుడు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూనే, నా నుంచి బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను.

సిద్ధ పాత్రను ముందుగా గెస్టు రోల్ గా భావించి మొదలుపెట్టారు. ఆ తరువాత ఆ పాత్ర పరిథి పెరుగుతూ వెళ్లింది. ఈ సినిమాలో నా పాత్ర సెకండాఫ్ లో వస్తుంది .. 40 నిమిషాల పాటు తెరపై కనిపిస్తుంది. అయినా సెకండాఫ్ మొత్తం ఈ పాత్ర ఉందనే ఫీలింగ్ ఉంటుంది. సిద్ధ పాత్ర చాలా పవర్ఫుల్ గా ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది. ఇది 'ఆచార్య'వారసత్వాన్ని కొనసాగించే కామ్రేడ్ పాత్ర. ఆచార్య ఆశయాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్లే పాత్ర. నా కెరియర్లో ఈ పాత్ర ఒక ప్రత్యేక స్థానంలో నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు" అని చెప్పుకొచ్చాడు.