Begin typing your search above and press return to search.

'మహానటి' తరువాత నేను కీర్తికి ఫ్యాన్ అయ్యాను: చరణ్

By:  Tupaki Desk   |   27 Jan 2022 2:53 AM GMT
మహానటి తరువాత నేను కీర్తికి ఫ్యాన్ అయ్యాను: చరణ్
X
కీర్తి సురేశ్ నాయిక ప్రధానమైన 'గుడ్ లక్ సఖి' సినిమాను చేసింది. నాగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 28వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చరణ్ ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై చరణ్ మాట్లాడుతూ .. "నేను ఇక్కడికి ఒక చీఫ్ గెస్టుగా రాలేదు .. నాన్నగారి మెసెంజర్ గా వచ్చాను .. ఎందుకనేదీ మీ అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఫంక్షన్ కి వస్తానని ఆయన ప్రామిస్ చేశారు .. కానీ రాలేకపోయారు. అందువల్లనే ఆయన కోసం నేను వచ్చాను. ఆయన తరఫున ఇక్కడికి వచ్చినందుకు నాక్కూడా ఆనందంగానే ఉంది.

ముందుగా యంగ్ ప్రొడ్యూసర్స్ శ్రావ్య - సుధీర్ ఇద్దరూ కూడా ఒక బ్యూటిఫుల్ జర్నీ చేస్తూ ఈ రోజున ఈ స్థాయికి వచ్చారు. నిజంగా ఇది మామూలు విషయం కాదు .. అందువలన నేను వాళ్లను అభినందిస్తున్నాను. నేషనల్ అవార్డు విన్నర్ నాగేశ్ కుకునూర్ గారు .. దేవిశ్రీ ప్రసాద్ గారు .. శ్రీకర్ ప్రసాద్ గారు .. చిరంతాన్ దాస్ గారు .. ఇక మహానటి గారు. ఇంతమంది నేషనల్ అవార్డు విన్నర్స్ ఈ సినిమాకి పనిచేయడం విశేషం. ఈ సినిమా తప్పకుండా చాలా గొప్పగా ఉంటుందని నేను భావిస్తున్నాను.

నాగేశ్ గారు తీసిన 'హైదరాబాద్ బ్లూస్' .. 'ఇక్బాల్' నేను నా చిన్నప్పుడు చూశాను .. అవి నన్నెంతో ప్రభావితం చేశాయి. ఆయనతో కలిసి స్టేజ్ ను షేర్ చేసుకున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందాక శ్రావ్యగారు చిన్న సినిమా .. చిన్న సినిమా అంటున్నారు. ఎందుకో ఆ మాట నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇంతమంది దొగ్గజాలు ఉన్నప్పుడు .. ఇంతమంది నేషనల్ అవార్డ్ ను సాధించినవారు ఉన్నప్పుడు .. ఒక 'మహానటి' ఇక్కడ ఉన్నప్పుడు ఇది చిన్న సినిమా ఎలా అవుతుంది?

ఈ సినిమాపై దేవిశ్రీ బ్రాండ్ ఉండటమనేది ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. దేవిశ్రీ నాతో కలిసి ఎన్నో సినిమాలకి పనిచేశారు. నాకు మంచి మంచి హిట్లు ఇచ్చారు. అలాంటి దేవిశ్రీ పనిచేసిన ఈ మీనింగ్ ఫుల్ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. రాజమౌళిగారు తెలుగు సినిమాను ఇండియన్ సినిమాగా చెప్పుకునే స్థాయికి తీసుకుని వెళ్లారు. ఆడ - మగ అనే తేడా లేకుండా అంతా కూడా ఒక్కటిగా సినిమాలకి పనిచేస్తున్నారు. అలా వర్క్ చేసిన ఈ సినిమా టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

'అజ్ఞాతవాసి'లోనే నేను కీర్తి సురేశ్ గారిని చూశాను. ఆమె పని తీరు ... క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చేశాయి. ఆ తరువాత 'మహానటి' చూసిన తరువాత నేను ఆమె వర్క్ కి ఫ్యాన్ గా మారిపోయాను. ఎంతో ప్యాషన్ తో వర్క్ చేసి ఒక్క దెబ్బతో నేషనల్ అవార్డు కొట్టారు. అది మామూలు విషయం కాదు. అందుకు ఆమెను అభినందిస్తున్నాను. ఈ సినిమాలోను ఆమె లుక్ .. క్యారెక్టరైజేషన్ చాలా బాగున్నాయి. ఈ శుక్రవారం ఈ సినిమా మీ ముందుకు వస్తోంది .. మంచి సినిమాను ఆదరించండి" అని చెప్పుకొచ్చాడు.