Begin typing your search above and press return to search.

20 శాతం రూల్ RC15కి ఆయాచిత వ‌రం

By:  Tupaki Desk   |   10 March 2022 11:30 PM GMT
20 శాతం రూల్ RC15కి ఆయాచిత వ‌రం
X
ఏపీలో టికెట్ ర‌గ‌డ‌కు తెర దించుతూ వైయ‌స్ జగ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఇటీవ‌ల స‌వ‌ర‌ణ‌ జీవోని జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. టికెట్ రేట్ల‌ను పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం వెలువ‌డింది. అంతేకాదు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 20శాతం అంత‌కుమించి షూటింగ్ చేసుకునే భారీ బడ్జెట్ చిత్రాల‌కు టికెట్ ధ‌ర‌లు పెంచుకునే వెసులుబాటు క‌ల్పిస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. హీరో ద‌ర్శ‌కుల పారితోషికాలు వ‌దిలేసి 100కోట్లు పైగా బ‌డ్జెట్ పెట్టే చిత్రానికి టికెట్ ధ‌ర‌ల్ని తొలి ప‌ది రోజులు పెంచుకునే వెసులుబాటు క‌ల్పించ‌నుంది ఏపీ ప్ర‌భుత్వం.

అయితే ఈ రూల్ తో లాభ‌ప‌డే తొలి భారీ చిత్రం RC15 అంటూ చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన రెండు షెడ్యూళ్ల‌ను పూర్తిగా రాజ‌మండ్రిలో నే శంక‌ర్ బృందం తెర‌కెక్కించారు. ఇంకా కీల‌క‌మైన షూటింగ్ అక్క‌డే సాగుతోంది. హైద‌రాబాద్ షెడ్యూల్ అనంత‌రం శంక‌ర్ పూర్తిగా రాజ‌మండ్రి ప‌రిస‌రాలు గోదావ‌రినే ఎంపిక చేసుకున్నారు. అయితే ఇది యాధృచ్ఛికంగా జ‌రిగినా కానీ మూవీ మేక‌ర్స్ కి భారీగా లాభాలు తేనుంది.

అయితే శంక‌ర్ వెన‌క ఉన్న మాస్ట‌ర్ మైండ్ ఎవ‌రో తెలిసిందే. ప్ర‌స్తుతం నిర్మాత దిల్ రాజు శంక‌ర్ వెంట ఉన్నారు. అంటే ప్ర‌తిదీ ప్లానింగ్ లో ఆయ‌న స‌హ‌కారం ఉంటుంద‌నడంలో సందేహం లేదు. స్క్రిప్టు ప‌రంగా కూడా లొకేష‌న్లు స్థానికంగా ఉండేలా డిజైన్ చేశార‌ని భావించ‌వ‌చ్చు.

ఇక ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ లో దిల్ రాజు అపార అనుభ‌వం ఇప్పుడు ప్ల‌స్ గా మారుతుంద‌ని అర్థ‌మ‌వుతోంది. బ‌డ్జెట్ల ప‌రంగా ఫ్లెక్సిబిలిటీ ఇస్తూనే దిల్ రాజు శంక‌ర్ కి అన్నివిధాలా స‌హ‌క‌రిస్తున్నార‌ని భావించాలి. ఇక‌పోతే ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ ఐఏఎస్ ట‌ర్న్ డ్ ముఖ్యమంత్రిగా క‌నిపిస్తార‌ని స‌ర్కారోడు అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

దాదాపు 200కోట్ల బ‌డ్జెట్ తో ఆర్.సి 15 తెర‌కెక్కుతోంది. ఇక ఏపీలో టికెట్ రేట్ల‌ను పెంచుకోవాలంటే రాజ‌మౌళి అయినా లేదా ఇంకెవ‌రైనా కూడా 20శాతం షూటింగుల్ని ఏపీలో చేయాల్సి ఉంటుంది. ఆర్.ఆర్.ఆర్ కోసం కూడా రాజ‌మౌళి చింత‌ప‌ల్లి- అర‌కు- మారేడుమిల్లి లొకేష‌న్ల‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అయితే అక్క‌డ 20శాతం షూటింగ్ చేసారా లేదా? అన్న‌ది ఎవ‌రికీ తెలియ‌ని అంశం. ఇక‌పై జ‌క్క‌న్న ఏది ప్లాన్ చేసినా ఏపీలో షెడ్యూల్ ని నియ‌మం ప్ర‌కారం.. ప్లాన్ చేస్తారేమో చూడాలి.