Begin typing your search above and press return to search.

'కరోనా' కారణంగా పుట్టినరోజు వేడుకలు నిలిపివేసిన రాంచరణ్..

By:  Tupaki Desk   |   18 March 2020 8:15 AM GMT
కరోనా కారణంగా పుట్టినరోజు వేడుకలు నిలిపివేసిన రాంచరణ్..
X
కరోనా వైరస్ కారణంగా దేశంలో సామాన్యులు సామాన్యులుగాను, సెలెబ్రిటీలు సెలెబ్రిటీలుగాను రోజువారీ జీవితాలను గడపలేకపోతున్నారు. ఎక్కడ చూసినా కరోనా భయం నెలకొనడం తో ఇళ్లలో నుండి బయటికి రావడానికి కూడా వణికిపోతున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలకు తగిన ఆరోగ్య సూచనలతో సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తూ ప్రభుత్వానికి, వైద్యులకు సహకరించాలని బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే..

అయితే తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ పుట్టినరోజు తేదీ దగ్గర పడుతుండటం తో అభిమానులలో సందడి మొదలైంది. ఈ నెల 27 న రాంచరణ్ పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరపడానికి అభిమానులు సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఈ విషయం తెలుసుకున్న రాంచరణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తన సందేశాన్ని పంపించాడు.

"మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు, అభిమానానికి నేనెప్పుడూ కట్టుబడి ఉంటాను. నా పుట్టినరోజు వేడుకలను జరపడానికి మీరెంత తాపత్రయపడుతున్నారో నేను అర్ధం చేసుకోగలను. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కరోనా వ్యాప్తి గురించి అందరికి తెలుసు కాబట్టి సాధ్యమైనంత వరకు జనసాంద్రత తక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని ఈసారి నా పుట్టినరోజు వేడుకలను జరుపుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను.

అభిమానులు కూడా వేడుకలను నిర్వహించాలనే నిర్ణయం మానుకుంటే మనకే మంచిది. మీరంతా కరోనా పై చర్యలు తీసుకుంటున్న అధికారులకు సహకరించి, కరోనా వైరస్ వ్యాప్తి గురించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని, మీ వంతు సామాజిక బాధ్యతే.. మీరు నాకిచ్చే పుట్టినరోజు బహుమానం" అంటూ తెలియజేసాడు.