Begin typing your search above and press return to search.

'రాజమౌళి గారి RRR' అంటూ రామ్ చరణ్ ఆసక్తికర ట్వీట్..!

By:  Tupaki Desk   |   27 March 2022 2:30 AM GMT
రాజమౌళి గారి RRR అంటూ రామ్ చరణ్ ఆసక్తికర ట్వీట్..!
X
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు RRR సందడి కొనసాగుతోంది. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా.. శుక్రవారం భారీ స్థాయిలో విడుదలై పాజిటివ్ టాక్ తో విజయవంతంగా నడుస్తోంది.

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని లేకుండా విడుదలైన అన్ని చోట్లా.. 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతోంది. తొలి రోజే రూ. 223 కోట్ల వసూళ్ళు అందుకొని బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక సినీ విమర్శకులు సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

జక్కన్న టేకింగ్ అద్భుతమని.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారని సగటు ప్రేక్షకులలతో పాటుగా సినీ ప్రముఖులూ కొనియాడుతున్నారు. RRR చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు సినీ అభిమానులకు దర్శక హీరోలు ధన్యవాదాలు తెలిపారు.

దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. 'ఆర్.ఆర్.ఆర్' సినిమా చూసి చప్పట్లు కొట్టి అభినందించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఈ క్రమంలో సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్స్ పెట్టిన ప్రతి ఒక్క సెలెబ్రిటీకి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

తాజాగా హీరో రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ''ఎస్ఎస్ రాజమౌళి గారి RRR సినిమా పట్ల మీరు చూపిస్తున్న అపారమైన ప్రేమ మరియు ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతో ఉత్సాహంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. ఈ అపూర్వమైన పుట్టినరోజు బహుమానాన్ని బాధ్యతతో స్వీకరిస్తాను'' అని చెర్రీ ప్రకటనలో పేర్కొన్నారు.

RRR సినిమా ఐదు భాషల్లో విడుదలైన నేపథ్యంలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ ఇంగ్లీషులలో సెపరేట్ గా థాంక్స్ నోట్ రిలీజ్ చేశారు. ఇద్దరు హీరోలు కలిసి నటించినప్పటికీ ఇది రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' అంటూ చరణ్ పేర్కొనడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇకపోతే మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం RRR చిత్రానికి వస్తున్న స్పందన చూసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ''మీ అచంచలమైన ప్రేమకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలు మరియు మద్దతు నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. 'ఆర్.ఆర్.ఆర్' సినిమాను చూసి ఆస్వాదించండి'' అని తారక్ ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా, 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇందులో అజయ్ దేవగన్ - అలియా భట్ కీలక పాత్రలు పోషించారు. కేవీ విజయేంద్ర ప్రసాద్ ఈ కథ రాయగా.. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేశారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహించారు.