Begin typing your search above and press return to search.

ఆర్థిక కార‌ణాల‌తో మ‌ధ్య‌లోనే ఆగిన సినిమాలు

By:  Tupaki Desk   |   9 Jan 2022 7:30 AM GMT
ఆర్థిక కార‌ణాల‌తో మ‌ధ్య‌లోనే ఆగిన సినిమాలు
X
సినిమా ఇండ‌స్ట్రీ అంటే ఒడిదుడుకుల మ‌యం. ఈ రంగంలో క‌ల‌ల్ని నిజం చేసుకోవాల‌ని ఎంద‌రో వ‌స్తుంటారు.. కానీ నెరవేర‌క వ‌చ్చిన దారినే వెళుతుంటారు. న‌ట‌వార‌సులుగా వ‌చ్చిన‌ వాళ్లు కూడా నిల‌దొక్కుకోవ‌డం అంత వీజీ ఏం కాదు. స‌క్సెస్ ఇక్క‌డ ప్ర‌తిదీ నిర్ణ‌యిస్తుంది. ప‌రిశ్ర‌మ అగ్ర హీరో వార‌సులే డ‌క్కా మొక్కీలు తింటున్నారు ఇక్క‌డ‌. కేవ‌లం 5శాతం స‌క్సెస్ రేటు ఉండే ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రిని అదృష్టం వ‌రిస్తుందో చెప్ప‌లేని పరిస్థితి ఉంది.

అయితే సూప‌ర్ స్టార్ కృష్ణ న‌ట‌వార‌సుడిగా రంగ ప్ర‌వేశం చేసిన ర‌మేష్ బాబు త‌నను హీరోగా నిల‌బెట్టేందుకు కృష్ణ లాంటి శిఖ‌రం అండ‌గా నిలిచినా కానీ అత‌డు ఎందుక‌నో హీరోగా రాణించ‌లేక‌పోయాడు. ప‌రిశ్ర‌మ అగ్ర ద‌ర్శ‌కులు దాస‌రి-జంధ్యాల‌-కోదండ రామిరెడ్డి వంటి వారి అండ‌దండ‌లు ఉన్నా కానీ ర‌మేష్ బాబు చొర‌వ‌గా ముందుకు దూసుకెళ్ల‌లేక‌పోయారు. ఇక కెరీర్ ప్లానింగ్ ప‌రంగానూ కొంత త‌డ‌బాటు అత‌డి కెరీర్ ని విశ్లేషిస్తే స్ప‌ష్ఠంగా క‌నిపిస్తుంది. వీట‌న్నిటినీ మించి స‌క్సెస్ ఇక్క‌డ కీల‌కం. అది ముఖం చాటేసినా లేదా ఆర్థిక వ్య‌వ‌హారాల్లో స‌ర్ధుబాటు కుద‌ర‌క‌పోయినా సినిమాలు నిలిచిపోతాయి. ఇలాంటి ఒక ఫేజ్ ని ర‌మేష్ బాబు ఎదుర్కొన్నారు. బ‌హుశా ఇలాంటి కార‌ణాలు అత‌డు న‌ట‌న నుంచి విర‌మించ‌డానికి కార‌ణ‌మని విశ్లేష‌ణలు సాగుతున్నాయి.

15 చిత్రాల్లో 3 జాన‌ప‌దాలు..!

సూపర్ స్టార్ కృష్ణ- రమేష్ బాబు హీరోలుగా అహో విక్ర‌మార్క్ (1996 సెప్టెంబర్‌)లో మొద‌లైనా అది మ‌ధ్య‌లోనే ఆగిపోయింది. సాగ‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇది ర‌మేష్ బాబుకు తొలి జాన‌ప‌ద చిత్రం. కానీ ఆర్థిక కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. రమ్యకృష్ణ ప్ర‌త్యేక పాత్ర‌తో సత్యన్నారాయణ- సుధాకర్- తనికెళ్ల భరణి- ఆలి- మల్లికార్జునరావు -బాబు మోహ‌న్ వంటి దిగ్గ‌జ న‌టుల‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. ర‌మేష్ బాబుకు ఇద్ద‌రు హీరోయిన్లు. కీర్తి-ర‌క్ష లాంటి హాట్ గాళ్స్ ని ఎంపిక చేసుకున్నారు. నవలా రచయిత సూర్యదేవర రామమోహనరావు అందించిన కథకు మరుధూరి రాజా మాటలు రాశారు. పద్మాలయా స్టూడియోలో సెట్స్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. 1997 జనవరిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ రెండు షెడ్యూల్స్ పూర్త‌య్యేలోపే నిర్మాత‌కు ఆర్థిక క‌ష్టాలు ఎదుర‌య్యాయి. అటుపై సినిమా నిలిచిపోయింది. హీరో కృష్ణ సాయం ఉన్నా కానీ అది పూర్త‌వ్వ‌లేదు. అలా అహో విక్రమార్క షూటింగ్ ఆగిపోయింది. ఆ త‌ర్వాత మ‌రో జాన‌ప‌ద చిత్రం భూలోక రంభ ఇలానే మ‌ధ్య‌లో ఆగిపోయింది. జానపద బ్రహ్మ విఠలాచార్య తనయుడు శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో 1996లో ఈ సినిమా మొద‌లైంది. ఇందులో కథానాయికగా రంభ పాత్రకు ఇంద్రజ ఎంపికయ్యారు. నరసింహరాజు కీలక పాత్రధారి ఇందులో. కానీ ఆర్థిక కార‌ణాల‌తో ఈ మూవీ కూడా నిలిచిపోయింది.

క‌రుణానిధి చేతుల మీదుగా..

రమేష్ బాబుకు 15 ఏళ్ల వయసులో నీడ చిత్రంతో హీరో అయ్యారు. ఈ మూవీకి దాస‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. వంద రోజుల వేడుకలో కరుణానిధి చేతుల మీదుగా జ్ఞాపిక అందుకున్నారు రమేష్ బాబు. కానీ ఆ త‌ర్వాత ఆర్టిస్టుగా ఎనిమిదేళ్లు గ్యాప్ తీసుకున్నారు. చెన్నై ల‌యోలా కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేసి చ‌దివేప్పుడు గ్యాప్ దొరికితే న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకున్నారు. తండ్రి నటించే చిత్రాల షూటింగ్స్ కు వెళ్లి న‌టన‌ను ప‌రిశీలించేవారు. అటుపై చ‌దువులు పూర్తి చేసి తిరిగి హీరోగా కెరీర్ ని సాగించారు.