Begin typing your search above and press return to search.

ఆమె ఫోటో పెట్టేశావ్.. ఆమె అనుమతి తీసుకున్నావా?

By:  Tupaki Desk   |   26 Aug 2021 5:30 AM GMT
ఆమె ఫోటో పెట్టేశావ్.. ఆమె అనుమతి తీసుకున్నావా?
X
రోటీన్ కు భిన్నమైన పనులు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తన ఫస్ట్ లవ్ ఫోటోల్ని షేర్ చేయటం తెలిసిందే. ఆ మధ్యన కామ్ గా ఉన్న ఆయన.. గడిచిన వారం రోజులుగా ఏదో ఒక టాపిక్ తో నిత్యం మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ హాట్ హాట్ గా నిలుస్తున్నారు. తాజాగా తాను బెజవాడలో బీటెక్ చేసే రోజుల్లో తాను ప్రేమించిన అమ్మాయి ఈమేనంటూ ఒక ఫోటోను పోస్టు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

తాను చదువుకునే రోజుల్లో వన్ సైడ్ లవ్ చేసిన ఆ అమ్మాయి ప్రస్తుతం అమెరికాలో ఉందని.. ఆమె పేరు పోలవరపు సత్యగా పేర్కొన్నారు. వర్మ దర్శకత్వం వహించిన సినిమాల్లో ‘సత్య’ సూపర్ హిట్ కావటం తెలిసిందే. అందులో రౌడీగా నటించిన జేడీ చక్రవర్తి సత్యగా నటించటం తెలిసిందే. ప్రస్తుతం ఆమె అమెరికాలో డాక్టర్ గా పని చేస్తున్నారంటూ.. ఆమెకు సంబంధించిన మూడు ప్రైవేటు ఫోటోల్ని పోస్టు చేశారు. అందులో రెండు ఫోటోలు బ్లూ కలర్ స్విమ్ షూట్ లో ఉండగా.. మరో దాన్లో మెడ్రస్ డ్రెస్ లో ఉన్నారు.

దాదాపు మూడు.. నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన.. వన్ సైడ్ లవ్ ను ఇలా బయటపెట్టటం వర్మకు బాగానే ఉన్నా.. మరి.. ఆయన ప్రేమించినట్లు చెబుతున్న సత్యకు ఓకేనా? అన్నదిప్పుడు ప్రశ్న. గడిచినకొద్దిరోజులుగా వర్మ చేస్తున్న చేష్టలకు పలువురు అవాక్కు అవుతున్నారు. ఇదేమి ఖర్మ అంటూ వర్మ తీరుపై మండిపడుతున్నారు. తన వ్యక్తిగత విషయాల్ని బయటపెట్టటం బాగానే ఉంటుంది. కానీ.. వారి ప్రైవేటు ఫోటోల్ని ఇలా పబ్లిక్ చేయటం ఎంతవరకు సబబు? వారి అనుమతితోనే ఇలా చేశారా? అన్నది ప్రశ్న.

వర్మ మాదిరే.. ఎవరికి వారు.. మా మొదటి ప్రేమ అంటూ.. తాము ప్రేమించినోళ్ల ఫోటోలోని ఇలా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటే ఏం కావాలి? తమ ప్రైవేటు విషయాల్ని పబ్లిక్ చేసుకోవటం కొంతమందికి ఇష్టం ఉంటుంది. తమ ప్రమేయం లేకుండానే ఇలా బయటకు వచ్చేసి.. ఎవరికి వారు.. నేను ప్రేమించిన అమ్మాయి ఈమనే.. అంటూ తన మనసులోని వికారాల్ని.. తనకు అనిపించిన భావాల్ని చెప్పేస్తూ పోతే ఏమవుతుంది? అదెంత వరకు సమంజసం? అన్నది ప్రశ్న.

నా ఇష్టం.. నా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తాను? అనటంలో తప్పు లేదు. కానీ.. ‘నా’ కాస్తా అందులోకి మరొకరు రావటంతోనే అసలు సమస్య అంతా. రాంగోపాల్ వర్మ పోస్టు చేసిన నిన్నటి ట్వీట్లో చూస్తే.. ఆయన కాలేజీ చదివే రోజుల్లో అతగాడి ఇన్ ఫిరియార్టీ కాంప్లెక్స్ ఇట్టే బయటకువస్తుంది.

తాను చదివే క్యాంప్.. మెడిసిన్ క్యాంపస్ పక్కపక్కనే ఉండటంతో.. రోజూ సత్యను తాను చేస్తుండేవాడినని ఆయన పేర్కొన్నారు. తను ఆమెతో ప్రేమలో పడినట్లు చెప్పిన వర్మ.. ‘‘కానీ.. ఆమె డబ్బు ఉన్న మరో వ్యక్తితో ప్రేమలో ఉన్న కారణంగా నన్ను పట్టించుకునేది కాదు’’ అన్న భావనలో తాను ఉండేవాడినని పేర్కొన్నారు. మనం ప్రేమించిన అమ్మాయి మనల్ని ప్రేమించకపోవటానికి సవాలచ్చ కారణాలు ఉండొచ్చు. వాటిని మన కోణంలో చెబితే ఎంత దుర్మార్గంగా ఉంటుంది. తాను ప్రేమించిన మొదటి అమ్మాయి విషయంలో వర్మ ఎంత సంకుచితంగా ఆలోచించాడన్న భావన కలుగక మానదు.

ఇలా ఎవరికి వారు.. వారి ఊహాశక్తికి తగ్గట్లుగా భావాల్ని బయటకు పెట్టేసి.. ఎదుటివారి మైండ్ సెట్ మీద తీర్పులు ఇచ్చేస్తూ పోవటం ఎంతవరకు సబబు? వ్యక్తిస్వేచ్ఛ గురించి లెక్చర్లు ఇచ్చే వర్మ.. ఇతరుల వ్యక్తి స్వేచ్ఛ.. ప్రైవసీల్ని పట్టించుకోరా? అన్నది మరో అంశం. తాను పోస్టు చేసిన ఫోటోలతోనే.. ఆమె అనుమతి తీసుకున్నది లేనిది కూడా ప్రస్తావిస్తే మరింత బాగుండేది. ఇదంతా చూస్తే.. వర్మ కంట్లో పడటమే నేరమవుతుందన్న భావన కలుగక మానదు. దీనికి వర్మ ఏమని బదులిస్తారు?