Begin typing your search above and press return to search.

మినీ రివ్యూ: రానా '1945' ఎలా ఉందంటే..?

By:  Tupaki Desk   |   7 Jan 2022 12:36 PM GMT
మినీ రివ్యూ: రానా 1945 ఎలా ఉందంటే..?
X
దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్ డ్రామా ''1945''. 'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా వైడ్ వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని రానా ఐదేళ్ల క్రితం చేసిన మల్టీలాంగ్వేజ్ సినిమా ఇది. రానా సరసన రెజీనా కసాండ్రా హీరోయిన్ గా నటించగా.. సత్యరాజ్ - నాజర్ - సప్తగిరి - కాళీ వెంక‌ట్ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. సత్యశివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సి. కళ్యాణ్ నిర్మించారు.

మేకర్స్ తో రానా కు మధ్య విభేదాలు రావడం.. మధ్యలో కరోనా పాండమిక్ రావడంతో ''1945'' సినిమా విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఎట్టకేలకు ఈరోజు శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వారిపై పోరాట‌మే ల‌క్ష్యంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ సినిమా బ్యాక్ డ్రాప్ సెట్ చేయబడింది. ఫ్యామిలీ బిజినెస్ చేసుకోవాలనుకునే ఆది (రానా దగ్గుబాటి).. బ్రిటిష్ ప్రభుత్వం కోసం పని చేసే తాశీల్దార్ (నాజర్) కూతురు (రెజీనా) ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న ద‌శ‌లో ఆది ఐఎన్ఏ ఎందుకు చేరాల్సి వచ్చింది?
ఆంగ్లేయుల మీద అతని పోరాటం ఎలా సాగింది? అనేదే ఈ సినిమా కథాంశం.

దేశభక్తి సినిమాలు చూడటానికి సినీ అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. తెరమీద కథకు తగ్గట్టుగా డ్రామా - భావోద్వేగాలు కలిస్తే ఆ సినిమాని ప్రేక్షకుడు ఆదరించినట్లే. అయితే ''1945'' సినిమాలో ఇలాంటి అంశాలు లోపించాయని తెలుస్తోంది. దర్శకుడు ఎంచుకున్న క‌థాంశం బాగున్నప్పటికీ.. ఏ దశలోనూ ఆకట్టుకునేలా తీర్చిదిద్దలేకపోయారని ప్రేక్షకులు తేల్చేశారు. అప్పటి నేపథ్యానికి తగ్గట్టుగా యాక్షన్ సీన్స్ - లొకేషన్స్ - కాస్ట్యూమ్స్ ఉన్నా.. సినిమాలో బలమైన సన్నివేశాలు - సరైన ఎమోషన్ లేకపోవడంతో నిరాశ చెందారు.

ఇందులో ఆది పాత్రకు రానా గొంతు వినిపించకపోవడం ఈ సినిమాలో మేజర్ మైనస్ గా చెబుతున్నారు. రానా తన పాత్రకు న్యాయం చేసినా.. మిగతా ప్రధాన పాత్రలకు నటించే అవకాశం లేకుండా పోయింది. నిర్మాణ విలువలు ఆశించిన స్థాయిలో లేవు. స‌త్య పొన్మార్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా.. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం పర్వాలేదనిపించింది. సరైన ముగింపు కూడా లేకపోవడంతో ప్రేక్షకుడు థియేటర్ లో ఓ అసంపూర్తి సినిమా చూసిన ఫీలింగ్ తో బయటకు వస్తున్నాడు. మొత్తం మీద ఓ ప్లాప్ మూవీతో 2022 సంక్రాంతికి స్వాగతం పలికారని తీర్పు ఇచ్చేసారు.