Begin typing your search above and press return to search.

తేజ‌తో ఎందుకు.. రానా స‌మాధాన‌మిది

By:  Tupaki Desk   |   31 July 2017 4:36 PM GMT
తేజ‌తో ఎందుకు.. రానా స‌మాధాన‌మిది
X
ఒక‌ప్పుడు ‘నువ్వు నేను’.. ‘జ‌యం’ లాంటి బ్లాక్ బ్ల‌స్ట‌ర్లు తీసిన తేజ‌.. త‌ర్వాత ట్రాక్ త‌ప్పాడు. గ‌త ప‌ది ప‌న్నెండేళ్ల‌లో ఆయ‌న సినిమా చేసిన సినిమాలేవీ కూడా ఆడ‌లేదు. ప్ర‌తిసారీ క‌సిగా సినిమా తీశాన‌ని తేజ చెప్ప‌డం.. చివ‌రికి ప్రేక్ష‌కులు తీవ్ర నిరాశ‌కు గురి కావ‌డం ష‌రామామూలైపోయింది. తేజ నుంచి చివ‌ర‌గా వ‌చ్చిన హోరాహోరి కూడా డిజాస్ట‌ర్ అయింది. ఈ దెబ్బ‌తో తేజ క‌థ ముగిసింద‌నుకున్నారు. ఆయ‌న‌కు ఇంకో అవ‌కాశం ద‌క్క‌డం క‌ష్ట‌మ‌నుకున్నారు. కాస్త పేరున్న ఏ హీరో తేజ‌తో సినిమా చేయ‌డానికి ముందుకు రాడ‌నుకున్నారు. కానీ రానా ద‌గ్గుబాటి లాంటి క్రేజున్న హీరో తేజ‌ను న‌మ్మాడు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేశాడు. రానా తండ్రి సురేష్ బాబే స్వ‌యంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

‘బాహుబ‌లి’.. ‘ఘాజీ’ లాంటి సినిమాల‌తో ఊపుమీదున్న రానా.. తేజ ట్రాక్ రికార్డు చూసి సినిమా ఒప్పుకోవ‌డం ఆశ్చ‌ర్య‌మే. మ‌రి ఏ ధైర్యంతో తేజ‌తో సినిమా చేశార‌ని రానాను అడిగితే.. ‘‘తేజ‌తో సినిమా ఎందుకు అని న‌న్ను చాలామంది అడిగారు. నేనెప్పుడు ద‌ర్శ‌కుల ట్రాక్ రికార్డులు.. వాళ్ల పేర్లు చూసి సినిమాలు చేయ‌లేదు. ‘బాహుబ‌లి’ సినిమా చేసింది రాజ‌మౌళిని చూసి కాదు. ఆ క‌థ‌లోని గొప్ప‌ద‌నం అర్థం చేసుకుని. రాజ‌మౌళి కంటే ‘బాహుబ‌లి’ గొప్ప‌ది. అలాగే సంక‌ల్ప్ రెడ్డి లాంటి కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేశానంటే ఆ క్రెడిట్ ‘ఘాజీ స్క్రిప్టుదే. ‘నేనే రాజు నేనే మంత్రి’ విష‌యంలోనూ ఇలాగే ఆలోచించా. ఆ క‌థ న‌చ్చి తేజ‌తో సినిమా చేశా. తేజ గారు గొప్ప ర‌చ‌యిత‌. నాకు క‌థ‌ను అద్భుతంగా న‌రేట్ చేశారు. ఈ క‌థ మీద చాలా క‌స‌ర‌త్తు చేశాం. దాదాపు ప‌ది నెల‌లు ప‌ని చేసి స్క్రిప్టును చ‌క్క‌గా తీర్చిదిద్దుకున్నాం. సినిమా కూడా అంతే బాగా వ‌చ్చింది అని రానా తెలిపాడు.