Begin typing your search above and press return to search.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రానా - రకుల్ పేర్లు ఎలా వచ్చాయి..?

By:  Tupaki Desk   |   3 Sep 2021 8:30 AM GMT
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రానా - రకుల్ పేర్లు ఎలా వచ్చాయి..?
X
తెలుగు చిత్రసీమలో నాలుగేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారణ చేసి క్లీన్ చీట్ ఇచ్చిన కేసులో.. మనీలాండరింగ్ అంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన డ్రగ్ సప్లయిర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ 12 మందికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

డ్రగ్స్ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయనే కోణంలో ఈ విచారణ జరుగుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్ - నటి ఛార్మీ కౌర్ లను ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈరోజు శుక్రవారం రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ఎదుట హాజరయ్యారు. అయితే 2017లో ఎక్సైజ్ శాఖ జరిపిన విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ - రానా దగ్గుబాటి పేర్లు లేవు. సిట్ విచారించిన సెలబ్రిటీలలో కూడా వీరిద్దరూ లేరు. అలాంటిది ఈడీ ఇద్దరినీ విచారణ చేయడం గురించి చర్చ జరుగుతోంది.

అయితే కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు హీరో నవదీప్ నిర్వహించిన ఎఫ్ క్లబ్ ఖాతాలను ఈడీ పరిశీలించగా.. అందులో రకుల్ ప్రీత్ - రానా పేర్లు బయటకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. క్లబ్ మేనేజర్ ఖాతాల ఆధారంగా రకుల్ - నవదీప్ - కెల్విన్ మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించిందని.. ఎఫ్ క్లబ్ మేనేజర్‌ కు పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయినట్లు ఈడీ నిర్ధారణకు వచ్చిందని టాక్ నడుస్తోంది. గతంలో ఎఫ్ క్లబ్ పార్టీకి రకుల్ - రానా ఇద్దరూ హాజరయ్యారని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారట.

ఈ నేపథ్యంలో డ్రగ్స్ క్రయవిక్రయాలలో వీరి పాత్ర గురించి తెలుసుకునేందుకే వారికి ఈడీ నోటీసులు జారీ చేసారని చెప్పుకుంటున్నారు. ఇదే కనుక నిజమైతే నాలుగేళ్ల క్రితం సిట్ విచారణలో రానా - రకుల్ పేర్లు లేకపోవడం కూడా పలు సందేహాలకు తావిస్తోంది. ఇకపోతే రకుల్ విచారణ రెండున్న గంటలకు పైగా జరుగుతోంది. ఆమె బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ట్రాన్సక్షన్స్ పై ఈడీ ప్రశ్నలు సంధిస్తోందని సమాచారం. బాలీవుడ్ డ్రగ్స్ లో అరెస్ట్ అయిన రియా చక్రవర్తికి స్నేహితురాలు కావడంతో రకుల్ ప్రీత్‌ సింగ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత సెప్టెంబర్ 8న రానా - 9న రవితేజ మరియు ఆయన డ్రైవర్‌ శ్రీనివాస్‌ - 13న నవదీప్‌ మరియు ఎఫ్‌ క్లబ్‌ పబ్‌ జనరల్‌ మేనేజర్‌ - 15న ముమైత్‌ ఖాన్ - 17న తనీష్‌ - 20న నందు - 22న తరుణ్‌ ఈడీ ఎదుట హాజరు కానున్నారు.