Begin typing your search above and press return to search.

ఫస్ట్ గ్లింప్స్: డా. రవి శంకర్ 'కామ్రేడ్ రవన్న' గా ఎందుకు మారాడో చెప్పే 'విరాటపర్వం'

By:  Tupaki Desk   |   14 Dec 2020 6:07 AM GMT
ఫస్ట్ గ్లింప్స్: డా. రవి శంకర్ కామ్రేడ్ రవన్న గా ఎందుకు మారాడో చెప్పే విరాటపర్వం
X
దగ్గుబాటి రానా - సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''విరాటపర్వం''. 'నీదీ నాదీ ఒకే క‌థ' ఫేమ్ వేణు ఊడుగుల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్‌.ఎల్‌.వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. 1990ల నాటి నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రవి అన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. నేడు రానా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ గ్లింప్స్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

''ఈ దేశం ముందు ఒక ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది.. సత్యాన్వేషణ లో నెత్తురోడిన హృదయం అతనిది'' అంటూ డా. రవి శంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్న త్వరలోనే మీ ముందుకు వస్తున్నారని 'విరాటపర్వం' ఫస్ట్ గ్లింప్స్ చూపించారు. ఇందులో ఏకే-47 పట్టుకుని గంభీరంగా నడుస్తున్న రానా లుక్ ఆకట్టుకుంటోంది. చివర్లో 'ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం' అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం.. డానీ సాంచెజ్‌ లోపెజ్ - దివాకర్ మణి అందించిన విజువల్స్ బాగున్నాయి. ఈ టీజర్ ద్వారా డాక్టర్ రవి శంకర్ కామ్రేడ్ రవన్న గా మారిన విధానాన్ని చూపిస్తారని తెలుస్తోంది.

కాగా, కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రానా.. మరో విలక్షణమైన పాత్రలో నటించాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ ప్రియ‌మ‌ణి - నివేథా పేతురాజ్ లు కీల‌క పాత్ర‌లో నటించారు. నందితా దాస్‌ - ఈశ్వ‌రీరావు - జ‌రీనా వ‌హాబ్ - నవీన్ చంద్ర - సాయి చంద్ - బెనర్జీ - రాహుల్ రామకృష్ణ - నాగినీడు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. లాక్‌ డౌన్ కారణంగా షూటింగ్‌ కి బ్రేక్ తీసుకున్న చిత్ర యూనిట్ ఇటీవలే తిరిగి చిత్రీకరణ ప్రారంభించారు. ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.