Begin typing your search above and press return to search.

భీమ్లా నాయ‌క్ పై రానా అభిమానులు సీరియ‌స్

By:  Tupaki Desk   |   15 Aug 2021 11:30 AM GMT
భీమ్లా నాయ‌క్ పై రానా అభిమానులు సీరియ‌స్
X
ప‌వ‌ర్ స్టార్ మేనియా మ‌ళ్లీ మొద‌లైంది. `భీమ్లా నాయ‌క్ గ్లింప్స్` ఇప్పుడు సోష‌ల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. ప‌వ‌న్ ఎంట్రీనే ఓ రేంజ్ లో ఉండ‌టంతో అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవ్. ఆరంభ‌మే ఈ రేంజ్ లో ఉందంటే ప‌వ‌న్ పుల్ లెంగ్త్ క్యారెక్ట‌ర్ ఇంకే స్థాయిలో అల‌రిస్తుందో అంటూ క్యూరియాసిటీ పెరుగుతోంది. భీమ్లా నాయ‌క్ టైటిల్ లాంచ్ తో ఫ‌స్ట్ లుక్ గ్లింప్స్ భారీ షేర్లు.. లైకుల‌తో నెట్టింట వైర‌ల్ అవుతోంది. ప‌వ‌ర్ స్టార్ డైలాగులకు థియేట‌ర్లు దద్ద‌రిల్ల‌డం ఖాయంగానే క‌నిపిస్తుంది. ఇందులో ప‌వ‌న్ భీమ్లా పాత్ర‌లో క‌నిపించనున్నారు. మల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ `అయ్య‌ప్పన‌మ్ కోషియ‌మ్` ఒరిజ‌న‌ల్ లో బిజుమీన‌న్ (అయ్య‌ప్ప‌న‌మ్) ఈ పాత్ర‌లో న‌టించారు. అక్క‌డ ఆ పాత్ర‌ లుంగీ క‌ట్టుకునే ఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు ప‌వ‌న్ కూడా గ‌ళ్ల‌ పంచెలో ఎంట్రీ ఇచ్చిన తీరు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

బిజుమీన‌న్ పోలీస్ పాత్ర‌ను ప‌వ‌న్ పోషిస్తున్నారు స‌రే.. `భీమ్లా నాయ‌క్` నే టైటిల్ గా ఎంపిక చేయ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌ళ‌యాల మాతృక‌లో కోషియుం (పృథ్వీరాజ్) పాత్ర పేరును క‌లుపుకుని `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుం` అని టైటిల్ గా నిర్ణ‌యించ‌గా.. తెలుగు వెర్ష‌న్ లో కేవ‌లం ప‌వ‌న్ పాత్ర‌కే ప్రాధాన్య‌త‌నిస్తూ టైటిల్ అత‌డిపైనే పెట్ట‌డం ఎంత‌వ‌ర‌కూ కరెక్ట్ అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. కోషియం (పృథ్వీ) పాత్ర పోషిస్తున్న రానాకు ప్రాధాన్య‌త ఇంతేనా అంటూ అత‌డి అభిమానులు సీరియ‌స్ అవుతున్నారు. సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ క‌నిపిస్తోంది.

అయితే నిర్మాత‌ దీనికి వివ‌ర‌ణ‌ను ఇచ్చారు. నిర్మాత నాగ‌వంశీ మాట్లాడుతూ ..``అప్పుడే తుది నిర్ణ‌యానికి రావొద్దు. ప్ర‌తిదీ టైమ్ ప్ర‌కారం వ‌స్తుంది. వెయిట్ చేయండి.. వెయిటింగ్ త‌ప్ప‌దు!!`` అని బ‌దులిచ్చారు. అంటే నిర్మాత మాట‌ల్లోనే రానా పోషించే పాత్రకు ప్రాధాన్య‌త త‌గ్గించార‌నే దానిపై క్లారిటీ వ‌చ్చిన‌ట్లు అయింది. ఫైన‌ల్ డెసిష‌న్ కి రావొద్దన్నారంటే? ప‌వ‌న్ పాత్ర‌పై అతిగా ఊహించుకోకుండా బ్యాలెన్స్ డ్ గా ఉండ‌మ‌ని ప‌రోక్షంగా చెప్ప‌డ‌మే. రానా పాత్ర కూడా ప‌వ‌న్ పాత్ర‌కు ఎంత మాత్రం త‌గ్గ‌కుండా ధీటుగా ఉంటుంద‌ని క్లారిటీ ఇవ్వ‌డ‌మే.

ఈ చిత్రంలో రానా పాత్ర పేరు డేనియ‌ల్ సీజ‌ర్. మాతృక‌లో ఇదే పాత్ర‌ను పృథ్వీరాజ్ పోషించారు. ఇక ఈ పాత్ర ఎంట్రీ కూడా పీక్స్ లోనే ఉంటుంది. సినిమాలో రెండు పాత్ర‌లు పోటా పోటీగా సాగుతాయి. ఈగో హ‌ర్ట‌యిన ఒక పెద్ద మ‌నిషితో నిజాయితీప‌రుడైన‌ పోలీస్ అధికారి ఘ‌ర్ష‌ణ ఏమిట‌న్న‌ది తెర‌పై చూడాల్సిందే. ఈ చిత్రానికి సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త్రివిక్ర‌మ్ ర‌చ‌న‌తో పాటు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది.