Begin typing your search above and press return to search.

ఘాజీ డైరెక్టర్ని గుర్తించండి బాబులూ!

By:  Tupaki Desk   |   18 Feb 2017 8:33 AM GMT
ఘాజీ డైరెక్టర్ని గుర్తించండి బాబులూ!
X
ఘాజీ.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. ఇండియాలో తొలి అండర్ వాటర్ వార్ ఫిలింగా గుర్తింపు సంపాదించిన ఈ సినిమా.. ప్రపంచ స్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలో తెరకెక్కి ఇటు విమర్శకులను.. అటు ప్రేక్షకులనూ విశేషంగా ఆకట్టుకుంటోంది. విడుదలకు రెండు రోజుల ముందే సెలబ్రెటీలకు.. మీడియాకు ఈ సినిమా స్పెషల్ ప్రివ్యూ షోలు వేయడంతో ముందుగానే పాజిటివ్ టాక్ బయటికి వచ్చేసింది. రిలీజ్ తర్వాత కూడా అదే టాక్ రావడంతో.. మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. సోషల్ మీడియాలో ఈ సినిమాపై సెలబ్రెటీలు.. సామాన్యులు ప్రశంసల వర్షం కురిపించేస్తున్నారు. గత ఏడాది అమీర్ ఖాన్ సినిమా ‘దంగల్’ తర్వాత ఆ స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకున్నది ‘ఘాజీ’నే అని చెప్పాలి.

ఐతే అంతా బాగుంది కానీ.. ఈ సినిమాను తెగ పొగిడేస్తున్న సెలబ్రెటీలందరూ కూడా హీరో రానా దగ్గుబాటినే దృష్టిలో పెట్టుకుంటున్నారు. అతడి పేరే ప్రస్తావిస్తున్నారు. దర్శకుడు సంకల్ప్ గురించి మాట్లాడట్లేదు. క్రిష్ లాంటి డైరెక్టర్ సైతం.. ‘‘ఘాజీ టీం అండ్ రానా టేక్ ఎ బౌ’’ అన్నాడు తప్ప సంకల్ప్ పేరెత్తలేదు. ఇంకా చాలామంది సెలబ్రెటీలు రానా పేరుపెట్టి పొగుడుతున్నారు తప్ప సంకల్ప్ గురించి ప్రస్తావిస్తున్న వాళ్లు చాలా తక్కువమంది. ఒక కొత్త దర్శకుడిని నమ్మి రానా ఇలాంటి సినిమా చేయడం.. దాని మార్కెట్ పరిధిని పెంచేందుకు తన వంతుగా ప్రయత్నం చేయడం గొప్ప విషయమే. సినిమాలో అతడి నటన కూడా ఆకట్టుకుంది. కానీ ‘ఘాజీ’కి సంబంధించి మేజర్ క్రెడిట్ దక్కాల్సింది మాత్రం దర్శకుడు సంకల్ప్ కే. తొలి ప్రయత్నంలోనే ఇలాంటి సినిమాను తెరకెక్కించడం అసాధారణ విషయం. సబ్ మెరైన్.. నేవీ వ్యవహారాలపై అతడికున్న అవగాహన.. ‘ఘాజీ’ స్క్రిప్టు విషయంలో.. సినిమాను తెరకెక్కించడంలో అతడి ప్రతిభ.. కష్టం.. అన్నీ తెరమీద కనిపించాయి. పెద్ద దర్శకుడు సైతం ధైర్యం చేయలేని స్క్రిప్టును ఎంచుకుని.. దాన్ని పకడ్బందీగా తెరకెక్కించిన సంకల్ప్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్లో మేజర్ షేర్ అతడికి ఇవ్వాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/