Begin typing your search above and press return to search.

రానా చంద్రబాబును దించేస్తున్నాడట

By:  Tupaki Desk   |   26 Aug 2018 10:14 AM GMT
రానా చంద్రబాబును దించేస్తున్నాడట
X
దగ్గుబాటి రానా అనగానే ముందు అందరికీ భల్లాల దేవుడి పాత్రే గుర్తుకొస్తుంది. ఆ క్యారెక్టర్ కోసం రానా తన అవతారాన్ని ఎలా మార్చుకున్నాడో.. కండలు పెంచి ఎంత దృఢంగా తయారయ్యాడో తెలిసిందే. ఆ పాత్ర తాలూకు క్రౌర్యాన్ని సినిమాలో చాలా బాగా చూపించాడు రానా. ఇప్పుడతను మరో విభిన్నమైన పాత్ర చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అవతారంలోకి మారిపోయాడు. ఈ పాత్ర కోసమే బాగా బరువు తగ్గి లుక్ చాలా మార్చుకుని సరికొత్తగా కనిపిస్తున్నాడు. సినిమాలో చంద్రబాబును డిట్టో దించేయడానికి తన వంతు ప్రయత్నమంతా చేస్తున్నానని రానా తెలిపాడు.

‘‘భల్లాలదేవ అనేది కల్పిత పాత్ర. అతను ఎలా ఉండాలన్న నియమమేమీ లేదు. అందుకే నేనేం చేసినా.. రాజమౌళి గారు ఏం చేయించినా చెల్లింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మన ముందే ఉన్నారు. ఆయన్ని డిట్టో దించకపోతే కష్టం. అందుకే బరువు తగ్గాను. కండలన్నీ పోయాయి. లుక్ మార్చుకున్నాను. ఆయన్ని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నాను. ‘ఎన్టీఆర్’ షూటింగ్ చాలా బాగా జరుగుతోంది. ఇంకన్ని రోజులు చిత్రీకరణలో పాల్గొంటే నా పాత్ర పూర్తవుతుంది’’ అని రానా తెలిపాడు. ఇక తాను నటిస్తున్న వేరే సినిమాలు.. చేయాల్సిన ప్రాజెక్టుల గురించి రానా స్పందిస్తూ.. ‘‘1945.. హాథీ మేరీ సాథీ సినిమాలు రెండు కొన్ని రోజుల ముందు వరకు కేరళలోనే షూటింగ్ జరుపుకున్నాయి. కానీ ఇప్పుడు వరదల కారణంగా అక్కడ షూటింగ్ చేసే పరిస్థితి లేదు. పరిస్థితులు యథా స్థితికి వచ్చాక మళ్లీ చిత్రీకరణ మొదలుపెడతాం. గుణశేఖర్ దర్శకత్వంలో చేయాల్సిన ‘హిరణ్య కశ్యప’ ప్రస్తుతం స్క్రిప్టు దశలో ఉంది. వచ్చే ఏడాది సెట్స్ మీదికి వెళ్తుంది’’ అని రానా తెలిపాడు.