Begin typing your search above and press return to search.

రానా నిర్ణ‌యం స‌రైన‌దేనా?!

By:  Tupaki Desk   |   31 July 2015 8:27 PM GMT
రానా నిర్ణ‌యం స‌రైన‌దేనా?!
X
`బాహుబ‌లి`తో బోలెడంత పేరు తెచ్చుకొన్నాడు రానా. ఒక్క దెబ్బ‌కి రెండు పిట్ట‌ల‌న్న‌ట్టుగా ఆ ఒక్క సినిమాతోనే ఇటు సౌత్‌ లోనూ, అటు బాలీవుడ్‌ లోనూ ఫేమస్ అయిపోయాడు. భ‌ల్లాల‌దేవ పాత్ర‌తో రానాకి ఆల్మోస్ట్‌ గా మాస్ హీరో అన్న గుర్తింపు వ‌చ్చింది. తెలుగులో ఇంకా త‌డ‌బ‌డుతున్న క‌థానాయ‌కుడిగానే క‌నిపించిన రానా `బాహుబ‌లి`తో ఏకంగా స్టార్ అయిన‌ట్టు క‌నిపిస్తున్నాడు. వేరెవ‌రికైనా ఇలాంటి సినిమా ప‌డితే వెంట‌నే మాస్ క‌థ‌ని ఎంచుకొని బండిని ప‌ట్టాలెక్కించేస్తారు. కానీ రానా మాత్రం డిఫ‌రెంట్‌ గా అడుగులేసే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. మ‌ళ్లీ ఆయ‌న `లీడ‌ర్` త‌ర‌హా సినిమా చేయ‌బోతున్నారు. త‌రహా సినిమా అని కూడా కాదు, `లీడ‌ర్‌`కి సీక్వెలే చేయాల‌నుకొంటున్నాడు. ఆ విష‌యాన్ని స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టాడు. దీంతో రానా నిర్ణ‌యంపై అందరూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. రానా నిర్ణ‌యం స‌రైంది కాదేమో అన్న సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

రానా ఇప్ప‌టికిప్పుడే `లీడ‌ర్ 2` చేయ‌లేడు. ఆయ‌న ఇంకా `బాహుబ‌లి 2` పూర్తి చేయాల్సి వుంది. త‌మిళంలోనూ, హిందీలోనూ కొన్ని ప్రాజెక్టులు ఒప్పుకొన్నాడు. `బాహుబ‌లి2` పూర్త‌వ్వ‌డానికి ఇంకో యేడాదైనా ప‌డుతుంది. అంటే యేడాదిన్న‌ర త‌ర్వాత లీడ‌ర్‌2 ప‌ట్టాలెక్కొచ్చు. `బాహుబ‌లి`తోనే ఇంత ఇమేజ్ తెచ్చుకొన్నా రానా, బాహుబ‌లి 2తో మ‌రింత పేరు తెచ్చుకొంటాడు. మ‌రి అప్పుడు `లీడ‌ర్ 2` చేయ‌డం క‌రెక్టు కాదేమో అంటున్నారు చాలామంది. శేఖ‌ర్ క‌మ్ముల తీసిన `లీడ‌ర్`ని ఓ ఆల్టర్నేట్ సినిమాగా అభివ‌ర్ణించారు అప్ప‌ట్లో. అద్భుత‌మైన క‌థే అయినా... ఆ త‌ర‌హా సోష‌ల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ప్రేక్ష‌కుల‌కు అంత‌గా రుచించ‌దు అన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఆ కామెంట్‌కి త‌గ్గ‌ట్టుగానే సినిమాకి మిక్స్‌డ్ రెస్పాన్స్ వ‌చ్చింది. `లీడ‌ర్‌2`ని కూడా శేఖ‌ర్ క‌మ్ముల‌నే తెర‌కెక్కించ‌బోతున్నార‌ని స‌మాచారం. ఒక‌వేళ లీడ‌ర్‌ కి సీక్వెల్ వ‌స్తే మాత్రం తొలి సినిమాకంటే వేగంగా, మ‌రిన్ని మాస్ అంశాల‌తో తెర‌కెక్కాల్సి వుంటుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.