Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు రోల్ కోసం ప్రిప‌రేష‌న్‌

By:  Tupaki Desk   |   7 Aug 2018 4:32 AM GMT
చంద్ర‌బాబు రోల్ కోసం ప్రిప‌రేష‌న్‌
X
బ‌యోపిక్‌ ల వెల్లువ‌లో గొప్ప గొప్ప వ్య‌క్తుల జీవితాల్ని వెండితెర‌కెక్కిస్తున్నారు. జీవించి ఉన్న‌ - జీవించి లేని ప్ర‌ముఖుల జీవితాల్ని తెర‌కెక్కిస్తూ కొత్త ట్రెండ్‌ ని ఫాలో అవుతున్నారు ఫిలిం మేక‌ర్స్‌. నాలుగు గోడ‌ల మ‌ధ్య కూచుని ఊహా జ‌నిత క‌థ‌లు రాసుకునే కంటే జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌తో - వాస్త‌విక జీవితాల‌తో సినిమాలు తీయ‌డాన్ని హాబీగా మార్చుకుంటున్నారు. ఇది మంచి ప‌రిణామ‌మే. ఎన్నో స్ఫూర్తివంత‌మైన జీవితాల్ని ప్రేక్ష‌కాభిమానుల‌కు చూపించే ప్ర‌య‌త్నాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. ఇన్నాళ్లు శోదిలో సినిమాలు అని థియేట‌ర్ల‌కు వెళ్ల‌కుండా టీవీలు - రేడియోల‌కు అంకిత‌మైన బాప‌తు జ‌నం కూడా థియేట‌ర్ల‌కు క‌దిలొస్తున్నారు. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌ - వైయ‌స్సార్ జీవితాల్ని వెండితెర‌కెక్కిస్తుండ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మాట్లాడుకుంటున్నారు. ఎన్టీఆర్ టైమ్‌ లోనే సినిమాలు చూడ‌డం మానేసిన‌ వాళ్లు ఈ సినిమాల గురించి చ‌ర్చిస్తున్నారంటే అది ఎంత క్యూరియ‌స్ పాయింటో అర్థం చేసుకోవాల్సిందే.

జీవించి ఉన్నా.. జీవించి లేకున్నా.. ప్ర‌ముఖుల పాత్ర‌ల్లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయాలంటే అందుకు చాలానే శిక్ష‌ణ అవ‌స‌రం. అవ‌స‌రం మేర క‌స‌ర‌త్తు చేయాల్సి ఉంటుంది. మ‌హాన‌టి సావిత్రి పాత్ర‌లో అభిన‌యించేందుకు కీర్తి సురేష్ త‌న‌కు సంబంధించిన కొన్ని వేల వీడియోల్ని వీక్షించింది. సావిత్రి హావ‌భావాలు - ఆహార్యం సినిమాలు చూసి నేర్చుకుంది. ఆ క‌ట్టు - బొట్టు - న‌డ‌వ‌డిక నేర్వ‌డం కోసం ఎంత‌గానో త‌పించింది. జ‌న్మ‌తః సినిమా కుటుంబం నుంచి వ‌చ్చింది కాబ‌ట్టి కీర్తికి అవేమీ క‌ష్టం కాలేదు. న‌టి మేన‌క న‌ట‌వార‌సురాలిగా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో దుల్కార్ స‌ల్మాన్ అంతే మెప్పించాడు. అందుకే ఇప్పుడు వాళ్ల‌కు అంత పేరు వ‌చ్చిన‌ప్పుడు ఇంకా ఎవ‌రైనా ప్ర‌ముఖుల పాత్ర‌ల్లో క‌నిపిస్తే పెద్ద ఎత్తున పోలిక ఉంటుంది.

ప్ర‌స్తుతం ఎన్టీఆర్ సినిమాలో చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌ను పోషిస్తున్నారు యువ‌ హీరో రానా. సుదీర్ఘ‌మైన రాజ‌కీయానుభ‌వం ఉన్న నాయకుడు ఆయ‌న‌. మూడుసార్లు ముఖ్య‌మంత్రి అయ్యారు. చంద్ర‌బాబు న‌డ‌క‌ - న‌డ‌త‌ - ఆహార్యం ఇవ‌న్నీ చాలా కొత్త‌గా - ప్రాక్టిక‌ల్‌ గా ఉంటాయి. అందుకే ఆ పాత్ర‌లో అభిన‌యించ‌డాన్ని రానా ఎంతో ఛాలెంజింగ్‌ గా తీసుకున్నార‌ట‌. ఇటీవ‌లే చంద్ర‌బాబును క‌లిసిన రానా చాలా సంగ‌తుల్నే ముచ్చ‌టించారు. ఎన్టీఆర్ చిత్రంలో త‌న పాత్ర గురించి తాను ఎలా ప్రిపేర‌వుతున్నాడో రానా స్వ‌యంగా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రివీల్ చేశాడు. ``25 ఏళ్లుగా చంద్ర‌బాబు నాయ‌కుడిగా ఎదుగుతున్న తీరును చూశాను. సంఘంలో జ‌నాల్ని ఎంత‌గానో ప్ర‌భావితం చేసిన గొప్ప నాయ‌కుడు. ఆయ‌న మీడియా ఫుటేజ్‌ - వీడియోలు ప‌రిశీలిస్తున్నా. వాటి నుంచి చాలానే స్ట‌డీ చేస్తున్నా``న‌ని రానా తెలిపారు. ఇదే సినిమాలో అక్కినేనిగా న‌టిస్తున్న మ‌రో న‌టుడు సుమంత్ ముందు అంతే ఛాలెంజ్ ఉంద‌న‌డంలో సందేహం లేదు.