Begin typing your search above and press return to search.

'భీమ్లా నాయక్' కోసం రానా అన్ని కోట్లు తీసుకుంటున్నాడా..?

By:  Tupaki Desk   |   24 Sep 2021 10:30 AM GMT
భీమ్లా నాయక్ కోసం రానా అన్ని కోట్లు తీసుకుంటున్నాడా..?
X
హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. 'బాహుబలి' సినిమాలో ప్రతినాయకుడు భళ్లాల దేవగా నటించిన రానా.. దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. 'హౌస్ ఫుల్ 4' చిత్రంలో కూడా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించి అలరించాడు. అప్పటి నుంచి రానా మళ్ళీ విలన్ క్యారక్టర్స్ జోలికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు 'భీమ్లా నాయక్' మూవీలో రానా చేస్తోంది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని టాక్ నడుస్తోంది.

మాలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని అనౌన్స్ చేసిన వెంటనే.. అందులో మరో పాత్ర ఎవరు చేయబోతున్నారని అందరూ ఆలోచించారు. ఎందుకంటే మాతృకలో ఇద్దరు హీరోలు ఉంటారు. ఇద్దరివీ పోటాపోటీగా సమాన ప్రాధాన్యత ఉన్న పాత్రలే. కానీ తెలుగులో పవన్ హీరో అనేసరికి మరో హీరోకి అంత ఇంపార్టన్స్ ఉండకపోవచ్చని సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో రానా దగ్గుబాటి కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అయితే ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రానికి 'భీమ్లా నాయక్' అని ఒక పాత్ర పేరుని టైటిల్ గా పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కథలో మార్పులు చేశారనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పవన్ ఫస్ట్ గ్లిమ్స్ లో రానా ను బూతులు తిట్టించి.. రానా టీజర్ లో గబ్బర్ సింగ్ అంటూ పవన్ ని పొంగించడంతో అందరూ ఓ నిర్ధారణకు వచ్చేశారు. ఇందులో రానా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రనే పోషిస్తున్నారని ఫిక్స్ అయ్యారు.

అయితే దగ్గుబాటి వారసుడు ఈ డానియల్ శేఖర్ పాత్ర చేయడానికి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 'భీమ్లా నాయక్' చిత్రానికి రానా 25 రోజుల కాల్ షీట్లను కేటాయించారట. దీనికి గానూ దాదాపు రూ.4 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కాబట్టే హీరో ఆ స్థాయిలో వసూలు చేస్తున్నాడని అంటున్నారు. 'బాహుబలి' సినిమాలో విలన్ గా మెప్పించిన రానా కంటే బెటర్ పర్సనాలిటీ.. పవన్ కళ్యాణ్ ను ఢీ కొట్టడానికి దొరకడని మేకర్స్ భావించి ఉండొచ్చు. అందుకే అన్ని కోట్లు ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. మరి సాగర్ కె. చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రానా ఏ మేరకు ప్లస్ అవుతాడో చూడాలి.