Begin typing your search above and press return to search.

అరె.. రుద్రమదేవిలో భల్లాలదేవుడికి ఏమైంది?

By:  Tupaki Desk   |   9 Oct 2015 10:30 PM GMT
అరె.. రుద్రమదేవిలో భల్లాలదేవుడికి ఏమైంది?
X
ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో.. అందులోకి తెలుగు సినిమా చరిత్రలో చెరిగిపోలేనటువంటి రికార్డులు సృష్టించిన ఒక సినిమాలో హీరోకి మించిన ఇమేజ్ విలన్ సొంతం చేసుకోవటం సాధ్యమేనా? అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు రానా. బాహుబలి సినిమాలో ఆయన పాత్రకు వచ్చిన మైలేజ్ అంతా ఇంతా కాదు. పేరుకు హీరో ప్రభాస్ అయినా.. జనాలు ఎక్కువగా మాట్లాడుకుంది మాత్రం రానా గురించే.

నిజానికి బాహుబలికి ముందు.. బాహుబలికి తర్వాత రానా ఇమేజ్ లో చాలానే మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన రుద్రమదేవి సినిమాలో ఆయన పాత్ర మీద చాలానే అంచనాలు వ్యక్తమయ్యాయి. ఆసక్తికరంగా.. ఆయన పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేకుండా పోవటం.. పలువురిని విస్మయానికి గురి చేసింది.

బాహుబలిలో అందరి దృష్టిని ఆకర్షించిన రానా..రుద్రమదేవిలో మాత్రం తేలిపోవటం ఏమిటన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రుద్రమదేవి కథలోకి వస్తే.. కాకతీయ సామ్రాజ్యంలో రాచరిక పరిస్థితులు చేయి దాటుతున్న వేళ.. రాణి రుద్రమ.. నిడదవోలు రాజు సాయాన్ని కోరుతుంది రాణి రుద్రమ. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ పాత్రను దర్శకుడు గుణశేఖర్ బాగా ట్రిమ్ చేయటంతో.. పెద్దప్రాధాన్యత లేని పాత్రగా రాణా పాత్ర మిగిలిందన్న మాట వినిపిస్తోంది.

దర్శకుడు పాత్రను ట్రిమ్ చేసినా.. బాహుబలిలో భళ్లాలదేవుడిగా తన బాడీ లాంగ్వేజ్ తో చెలరేగిపోయిన రానా.. రుద్రమదేవిలో మాత్రం అంతలా లేకపోవటంతో ఆయన అభిమానులు తీవ్రమైన నిరాశకు గురి అవుతున్నారని చెబుతున్నారు. తనకు ప్రాధాన్యత లేని పాత్రను రానా ఎందుకు ఒప్పుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో.. మంత్రిగా పని చేసిన ప్రకాశ్ రాజ్.. మహారాజుగా చేసిన కృష్ణంరాజు.. విలనీ షేడ్ లో కనిపించే సుమన్.. ఆదిత్యామీనన్.. విక్రమ్ జీత్ లాంటి వారికి ఎంతోకొంత పేరు వస్తే.. భల్లాలదేవుడు మాత్రం రుద్రమదేవిలో తేలిపోయారని బాధపడిపోతున్నారు ఆయన అభిమానులు.