Begin typing your search above and press return to search.

అన్న‌గారింట్లో నారావారి పెళ్లిచూపులు!

By:  Tupaki Desk   |   2 Sep 2018 6:47 AM GMT
అన్న‌గారింట్లో నారావారి పెళ్లిచూపులు!
X
ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఎన్టీఆర్ బ‌యోపిక్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. బాల‌కృష్న నటించి నిర్మిస్తోన్న ఈ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ చిత్రంలో కీల‌క‌మైన పాత్ర‌ల కోసం న‌టీన‌టుల ఎంపిక దాదాపుగా పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలో అతి కీల‌క‌మైన పాత్ర అయిన చంద్ర‌బాబు పాత్ర‌లో రానా న‌టిస్తోన్న విష‌యం విదిత‌మే. కొన్ని రోజులుగా అబిడ్స్ లోని ఎన్టీఆర్ పాత ఇంట్లో జ‌రుగుతోన్న షూటింగ్ లో రానా కూడా పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా త‌న అనుభూతిని మీడియాతో పంచుకున్నాడు. తొలిసారి ఆ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు భావోద్వేగానికి లోన‌య్యాన‌ని - అన్న‌గారు నడిచినచోట - ఆయన పడక గదిలో తిరగ‌డం గొప్ప అనుభూత‌ని రానా అన్నాడు. ఎన్టీఆర్ గారి ఇంట్లో తొలిరోజు షూటింగ్ త‌న‌ జీవితంలో మరచిపోలేని రోజ‌ని రానా తెలిపాడు.

చిన్నత‌నం నుంచి తెలుగు సినిమాపై ....ఆ త‌ర్వాత రాజ‌కీయాల‌పై ఎన్టీఆర్ ప్రభావం ఉంద‌ని....అటువంటి గొప్ప వ్య‌క్తి బ‌యోపిక్ లో న‌టించ‌డం త‌న అదృష్ట‌మ‌ని అన్నాడు. చంద్రబాబు పాత్ర‌లో నటించడం త‌న‌కు పెద్ద సవాల్ అని రానా అన్నాడు. ఎన్టీఆర్ కుటుంబానికి సెంటిమెంట్ అయిన ఇంట్లో షూటింగ్ చేయ‌డం త‌న జీవితంలో మ‌ర‌చిపోలేన‌ని అన్నాడు. తొలిసారి ఎన్టీఆర్ ఇంటికి వెళ్లిన చంద్ర‌బాబు...ఆయ‌న దృష్టిలో ప‌డ‌డం వంటి స‌న్నివేశాల‌ను రానాపై చిత్రీక‌రిస్తున్నార‌ని టాక్. లేదంటే....భువ‌నేశ్వ‌రిని చంద్ర‌బాబు పెళ్లి చూపులు చూసే సన్నివేశాలు షూట్ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. అయితే, చంద్ర‌బాబు పాత్ర‌లో రానా ఎంత‌వ‌ర‌కు ఒదిగిపోతాడ‌ని నంద‌మూరి అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.