Begin typing your search above and press return to search.
సెకండ్ సింగిల్: రంగస్థలాన నాటు డప్పులు
By: Tupaki Desk | 2 March 2018 12:30 PM GMTరంగ రంగ రంగస్థలాన అంటూ రెండు రోజుల నుండి తెగ ఊరిస్తున్నాడు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్లో రూపొందుతున్న ''రంగస్థలం'' సినిమాలోని ఈ పాట ఎలా ఉండబోతోంది? అదిగో ఇప్పుడు లిరికల్ వీడియో వచ్చేసిందిగా. పదండి ఎలా ఉందో చూద్దాం.
వినబడేట్లు కాదురా.. కనబడేట్లు కొట్టండేహా అంటూ సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు చెబుతుండగా ఈ 'రంగా రంగా రంగస్థలాన' పాట మొదలైంది. ముఖ్యంగా దేవిశ్రీప్రసాద్ కొట్టించిన నాటు తీన్మార్ డప్పులు ఈ పాటకు మాంచి ప్లస్ అనే చెప్పాలి. ఇకపోతే ఈ పాటను మొన్నామధ్యన తన తెలంగాణ యాసతో బొంబాట్ పోరీ పాటను పాడిన రాహుల సింప్లిగంజ్ పాడేశాడు. అటు తెలంగాణ యాస ఎంత బాగుందో ఇతడి గొంతులో ఈ ఫోక్ సాంగ్ కూడా బాగానే సెట్టయ్యింది. తిరునాళ్ళలో భాగంగా రామ్ చరణ్ అండ్ కో ఈ పాటకు స్టెప్పులేస్తున్నారని అర్ధమవుతోంది. చూస్తుంటే పాటలో ఊర మాస్ మూమెంట్స్ కాస్త గట్టిగానే ఉన్నట్లున్నాయ్.
అయితే పాటలో కాస్త ఫిలాసఫీ టచ్ ఎక్కువైంది. కనబడని చెయ్యేదో ఆడిస్తున్న తోలుబొమ్మలం అంటూ చంద్రబోస్ సాహిత్యంలో దర్శకుడు సుకుమార్ ఏదో మెసేజ్ ఇస్తున్నాడు. కాకపోతే ఈ మెసేజ్ బాగా ఎక్కాలంటే అక్కడ సినిమాలో విజువల్స్ పడాల్సిందే. అప్పుడే గట్టిగా కనక్ట్ అయ్యే ఛాన్సుంటుంది. మార్చి 30న రంగస్థలం విడుదల కానున్న సంగతి తెలిసిందే.